LOADING...
Uddhav Thackeray: శివసేనలో మళ్లీ సంక్షోభం.. రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
శివసేనలో మళ్లీ సంక్షోభం.. రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే

Uddhav Thackeray: శివసేనలో మళ్లీ సంక్షోభం.. రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

శివసేన(యూబీటీ)లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు తిరుగుబాటు వైఖరి అవలంబించడంతో శివసేన (యూబీటీ)లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో నిర్వహించిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే,తన పదవిపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు తన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయి తాను ఈ బాధ్యతలకు అర్హుడిని కాదని భావిస్తే, అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీ బాధ్యతలను ఎవరైనా సమర్థంగా నిర్వహించగలరని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

పార్టీ ఎంపీల తిరుగుబాటు కారణంగా ప్రజలు, ఓటర్లకు క్షమాపణలు

ఇటీవల జరిగిన పరిణామాలపై ఉద్ధవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీల తిరుగుబాటు కారణంగా ప్రజలు, ఓటర్లకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. అయితే, శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలు,సిద్ధాంతాల కోసం తన పోరాటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. శివసేన (యూబీటీ)కి చెందిన మొత్తం తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో ఆరుగురు పార్టీ ఆదేశాలను ధిక్కరించారు. సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేష్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నాయక్ నింబాల్కర్, సంజయ్ జాదవ్, భావ్‌సాహెబ్ పార్టీ జారీ చేసిన విప్‌ను పట్టించుకోకుండా పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరయ్యారు.

వివరాలు 

శివసేన (యూబీటీ) భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ప్రభావం

వీరంతా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభౌ వాజే మాత్రమే నిలిచినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు శివసేన (యూబీటీ) భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement