Loading...
Ujjain Mahakaleshwar Temple: మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 13 మంది భక్తులకు గాయాలు
మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 13 మంది భక్తులకు గాయాలు

Ujjain Mahakaleshwar Temple: మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 13 మంది భక్తులకు గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రావణ మాస సోమవారం కావడంతో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే నాగచంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని హరసిద్ధి ఆలయం ఎదుట ఉన్న బారికేడింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా జనసమ్మర్ధం పెరిగింది. భక్తుల రద్దీ, ఒత్తిడి విపరీతంగా పెరగడంతో అక్కడ స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు కిందపడిపోవడంతో పాటు మరికొందరు స్పృహ కోల్పోయినట్లు సమాచారం.

వివరాలు 

ఉదయం నుంచే ఆలయ పరిసరాల్లో భారీ రద్దీ

ఘటనపై వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. బాధితుల కుటుంబ సభ్యుల సహాయంతో వారిని జనసమ్మర్ధం నుంచి బయటకు తీసుకొచ్చారు.

గాయపడిన భక్తులను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సుమారు 13 మంది భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది.

మహాకాళుడితో పాటు నాగచంద్రేశ్వర స్వామి ప్రత్యేక దర్శనాల కోసం ఉదయం నుంచే ఆలయ పరిసరాల్లో భారీ రద్దీ నెలకొంది.

ఇప్పటివరకు 5.50 లక్షల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT