LOADING...
Delhi Bomb Blast: మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ నుంచి టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్‌.. బ్రెయిన్‌వాష్ చేసిన తీవ్రవాదులు
మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ నుంచి టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్‌.. బ్రెయిన్‌వాష్ చేసిన తీవ్రవాదులు

Delhi Bomb Blast: మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ నుంచి టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్‌.. బ్రెయిన్‌వాష్ చేసిన తీవ్రవాదులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు (Delhi Bomb Blast) దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఫరీదాబాద్‌లో ఉన్న ఉగ్ర కుట్ర ముఠాతో సంబంధాలు కలిగిన డా. ఉమర్‌ మహ్మద్‌ (Dr. Umar Mohammed) ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.

Details

ఎవరు ఈ ఉమర్‌ మహ్మద్‌?

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఉమర్‌ మహ్మద్‌ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. అతని తండ్రి జీహెచ్‌. నబీ భట్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి, దశాబ్దం క్రితం పదవీ విరమణ చేశారు. తల్లి షమీమా బానో గృహిణి. ఉమర్‌ శ్రీనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌, ఎండీ (మెడిసిన్‌) పూర్తి చేశాడు. అనంతరం జీఎంసీ అనంతనాగ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌గా సేవలందించాడు. తర్వాత ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ మెడికల్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

Details

అదిల్‌తో ఉమర్‌ సన్నిహిత సంబంధాలు

సోషల్‌ మీడియా ద్వారా తీవ్రవాద భావజాల ప్రభావానికి గురైన యువ డాక్టర్లలో ఉమర్‌ కూడా ఒకడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత ఆపరేషన్‌లో పలువురి వైద్యులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వారిలో ఉన్న డా. అదిల్‌తో ఉమర్‌ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ అనంతనాగ్‌లో కలసి పనిచేసినట్లు సమాచారం. అదిల్‌ అరెస్టు తర్వాత భయంతో ఉమర్‌ గుప్తనివాసం ఎంచుకుని, ఈ పేలుడు ఘటనకు పాల్పడ్డాడని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.

Details

కుటుంబసభ్యుల విచారణ

పేలుడు ఘటన తర్వాత ఉమర్‌ కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరులు జహూర్‌, ఆషిక్‌ నబీలను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. దర్యాప్తులో భాగంగా, పేలుడు రోజున ఉమర్‌ తన తల్లితో చివరిసారి మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. లైబ్రరీలో చదువుకుంటున్నానని, తాను బిజీగా ఉన్నందున ఫోన్‌ చేయవద్దని చెప్పి, అనంతరం మొబైల్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు సమాచారం. పేలుడు జరిగిన ప్రదేశంలో పోలీసులు గుర్తించిన శరీర అవశేషాలపై డీఎన్‌ఏ పరీక్షలు జరుపుతున్నారు. అవి ఉమర్‌వేనా అన్నది నిర్ధారించేందుకు అతని కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు.

Details

ఉగ్రవాద నెట్‌వర్క్‌ విస్తృతి

ఉమర్‌ మహ్మద్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు—తారిఖ్‌ అహ్మద్‌ మాలిక్‌, ఆమిర్‌ రషీద్‌, ఉమర్‌ రషీద్‌—ఈ పేలుడు కుట్రలో భాగమని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నలుగురూ ఒకే నెట్‌వర్క్‌ కింద పనిచేస్తున్నారన్న సూచనలు లభించాయి. భద్రతా వ్యవస్థలు దేశవ్యాప్తంగా ఉగ్రవాద ముఠాల కదలికలపై నిఘా కఠినతరం చేశాయి. దిల్లీ పేలుడు దర్యాప్తు కొనసాగుతుండగా, డా. ఉమర్‌ మహ్మద్‌ గత చరిత్ర, సంబంధాలు, ఆర్థిక లావాదేవీలను సవివరంగా పరిశీలిస్తున్నారు