Al Falah University: అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సా..
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్సిటీలో పని చేస్తున్న కొంత మంది డాక్టర్లు, "వైట్ కాలర్" ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధిత మాడ్యూల్ లో పనిచేశారని తెలుస్తోంది. ఎర్రకోట వద్ద కార్ బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న బాంబర్ ఉమర్ కూడా ఈ వర్సిటీలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు తేలడంతో ఒక్కసారిగా అల్ ఫలాహ్ పేరు మార్మోగింది. అదేవిధంగా, అరెస్టయిన డాక్టర్లకు కూడా ఈ వర్సిటీతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో భద్రతా ఏజెన్సీలు, విచారణ అధికారుల దృష్టి పూర్తిగా ఈ యూనివర్సిటీపై కేంద్రీకృతమైంది. యూనివర్సిటీ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపై క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
నేలకు దాదాపుగా 7 అడుగుల దిగువన మదర్సా
ఇదే సమయంలో, అల్-ఫలాహ్ యూనివర్సిటీకి సుమారు 900 మీటర్ల దూరంలో ఒక అండర్‌గ్రౌండ్ మదర్సా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మదర్సా ఫరీదాబాద్‌లోని ధౌజ్ ప్రాంతంలోని ఒక గ్రామానికి సమీపంలో, పూర్తిగా వేరే, ఒంటరి ప్రాంతంలో ఉంది. సుమారు 4000-5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, నేలకు దాదాపుగా 7 అడుగుల దిగువన ఈ మదర్సా నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. మదర్సా నిర్మాణంలో 3 అడుగుల భాగం మాత్రమే పైభాగంలో కనిపిస్తుంది, మిగతా నిర్మాణం భూగర్భంలో ఉంది. సాధారణ మదర్సాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నమైన నిర్మాణం అని అధికారులు తెలిపారు.
వివరాలు
మౌలాన ఇష్తేయాక్ పేరుతో మదర్సా నమోదు
ఈ మదర్సాను మౌలాన ఇష్తేయాక్ పేరుతో నమోదు చేసినట్లు తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట కార్ బాంబ్ ఘటనలో భాగమైన ఉమర్ నబీ సహచరుల్లో ఒకరు ముజమ్మిల్ షకీర్, ఇష్తేయాక్ ద్వారా మదర్సాలో ఒక గదిని అద్దెకి తీసుకున్నట్లు గుర్తించారు. విచారణలో ముజమ్మిల్ తన పేరు వెల్లడించిన తర్వాత అధికారులు ఇష్తేయాక్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటికీ, మదర్సాకు నిధులు ఎక్కడ నుండి వచ్చాయి, దాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనే విషయాలపై విచారణ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు