Delhi: ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమానిత బ్యాగ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో అనుమానిత బ్యాగ్ కనుగొనబడటంతో ఆ ప్రాంతంలో అప్రమత్తత పెరిగింది. బ్యాగ్ కనుగొనబడిన వెంటనే బీజేపీ కార్యాలయానికి చెందిన సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి వచ్చిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. పోలీసులు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. ఆ బ్యాగుపై పోలీసు స్టిక్కర్ ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి కట్టుదిట్టంగా అదుపులో ఉందని, ప్రజలు భయాందోళన లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చని అధికారి పేర్కొన్నారు. ముందస్తుగా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. బ్యాగ్ మూలాలను గుర్తిస్తున్నామని.. ముప్పును తోసిపుచ్చలేమన్నారు.
బ్యాగుపై పోలీసు స్టిక్కర్
శుక్రవారం, ఢిల్లీ బీజేపీ కార్యాలయం సమీపంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ వద్ద అనుమానిత బ్యాగ్ కనిపించడం తో పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది అక్కడి ప్రాంతాన్ని కవర్ చేసి, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. గమనించదగిన విషయం ఏమిటంటే, బ్యాగుపై పోలీసు స్టిక్కర్ ఉండటం. ఇంతవరకు దర్యాప్తు జరుగుతోంది, ఇది మరిచిపోయిన బ్యాగా లేదా అనుకోకుండా వదిలేసిందా అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజల భద్రత కోసం ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు మరింత పెంచినప్పటికీ, వారు ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఉండాలని పోలీసులు హామీ ఇచ్చారు.