LOADING...
Andhra Pradesh: విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం.. వర్సిటీలకు బోర్డు ఆఫ్‌ గవర్నర్స్
విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం.. వర్సిటీలకు బోర్డు ఆఫ్‌ గవర్నర్స్

Andhra Pradesh: విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం.. వర్సిటీలకు బోర్డు ఆఫ్‌ గవర్నర్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏకీకృత చట్టానికి సంబంధించిన మార్పులపై దాదాపు చర్చలు పూర్తి చేసి,త్వరలో మళ్లీ సమావేశమై తుది నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. కొత్త చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టంలో విస్తృత మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఆర్జీయూకేటీ,పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,జేఎన్‌టీయూ వర్సిటీలు,క్లస్టర్‌,ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. సాధారణ విశ్వవిద్యాలయాలన్నీ ఒకే చట్టం ఆధారంగా నడుస్తున్నాయి. ఇకపై వీటన్నింటినీ సమీకరించి "ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం" పేరుతో ఒకే చట్టం రూపంలోకి తేవాలని నిర్ణయించారు. ఈ కొత్త చట్టంలో ప్రతి విశ్వవిద్యాలయానికి తగిన ప్రాధాన్యాన్ని కాపాడుతూ, వాటి పరిపాలన, అధికారాల విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉండనున్నాయి.

వివరాలు 

సవరణ అమల్లోకి రాకముందే..  ఎన్నికల్లో వైసీపీ ఓటమి 

రాజీవ్‌ గాంధీ విజ్ఞాన,సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) కు ప్రత్యేక చట్టం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాల కులపతిగా గవర్నర్‌ వ్యవహరిస్తుండగా,వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలంలో ఈ విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రినే కులపతిగా నియమించేలా చట్ట సవరణ చేశారు. అయితే ఆ సవరణ అమల్లోకి రాకముందే ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో తాత్కాలికంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ మధుమూర్తిని ఇన్‌ఛార్జ్‌ కులపతిగా నియమించారు. గతంలో ప్రభుత్వం నేరుగా కులపతిని నియమించే విధానం ఉండేది. ఇప్పుడు RGUKTకి కూడా గవర్నర్‌ను కులపతిగా నియమించేందుకు సవరణలు చేపడుతున్నారు. ఈ మార్పును కొత్త ఏకీకృత చట్టంలో చేర్చబోతున్నారు.ప్రస్తుత RGUKT చట్టం ప్రకారం ఉపకులపతికి తక్కువ అధికారాలుండగా,కులపతికే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. కొత్త చట్టంలో ఈ అధికారాల పంపిణీలో మార్పులు చేయనున్నారు.

వివరాలు 

బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఏర్పాటు 

ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (EC) అనే పాలకవర్గం ఆధారంగా నడుస్తున్నాయి. ఈ వ్యవస్థను రద్దు చేసి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విధానాన్ని అనుసరించి బోర్డు ఆఫ్ గవర్నర్స్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా సంస్థలు పరిశ్రమలతో అనుసంధానమవుతూ విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ మార్పు దోహదం చేస్తుందని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. కొత్త బోర్డులో పారిశ్రామికవేత్తలు, నిపుణులు కూడా సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. వీరి సహకారంతో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం,కొత్త కోర్సులు ప్రారంభించడం వంటి అంశాలు అమలులోకి వస్తాయి. ఇప్పటివరకు ECలో వీసీ, ప్రిన్సిపల్‌, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు మాత్రమే సభ్యులుగా ఉండేవారు.

వివరాలు 

విశ్వవిద్యాలయాల పరిధులపై స్పష్టత అవసరం 

కానీ సిలబస్‌ మార్పులు, ఉద్యోగావకాశాల పెంపు వంటి అంశాలపై చర్చ జరగకపోవడం వల్ల ఈ మార్పు అవసరమైందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొన్ని విశ్వవిద్యాలయాల పరిధులపై అయోమయం నెలకొంది. పాత ప్రభుత్వ కాలంలో కొన్ని డివిజన్లు ఒక వర్సిటీ పరిధిలో ఉండి,కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చేరడం వల్ల ఈ గందరగోళం తలెత్తింది. ఏ జిల్లా ఏ విశ్వవిద్యాలయం పరిధిలోకి రావాలో అప్పట్లో స్పష్టత ఇవ్వలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నప్పటికీ, అదే జిల్లాలోని రంపచోడవరం ప్రాంతం ఆదికవి నన్నయ వర్సిటీలో ఉంది. మన్యం జిల్లాలో పార్వతీపురం ఆంధ్ర వర్సిటీ పరిధిలో ఉండగా,పాలకొండ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది.

వివరాలు 

డివిజన్‌లోని ఐదు మండలాలు ఇప్పటికీ ఆంధ్రకేసరి పరిధిలో..

ప్రకాశం జిల్లాలోని చీరాల డివిజన్‌ను బాపట్ల జిల్లాలో కలపడంతో అక్కడి విద్యాసంస్థల పరిధి మారింది. బాపట్ల డివిజన్‌ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందుతుండగా, చీరాల డివిజన్‌లోని కొన్ని మండలాలు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలోని కందుకూరు డివిజన్‌ ను నెల్లూరు జిల్లాలో చేర్చారు. ఈ డివిజన్‌లోని ఐదు మండలాలు ఇప్పటికీ ఆంధ్రకేసరి పరిధిలోనే ఉన్నాయి. రాయలసీమ జిల్లాలు మరియు నెల్లూరు ప్రాంతాలు శ్రీ వేంకటేశ్వర రీజియన్ పరిధిలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఉండటంతో స్థానిక రిజర్వేషన్ అంశంలో కూడా మార్పులు వచ్చాయి. ఈ అంశాలన్నింటిపై ఉన్నత విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.