One Nation, One Election Bill: వన్ నేషన్, వన్ ఎలక్షన్, సమగ్ర బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
దేశంలో ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినెట్ 'జమిలి బిల్లు'కు ఆమోదం తెలిపింది. దీంతో.. సమగ్ర బిల్లు పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది దేశంలో వేరే వేరుగా ఎన్నికలు నిర్వహించడం ప్రగతికి ఆటంకం అవుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రారంభం నుండి పేర్కొంటున్నది. ఈ పద్దతిని గురువారం నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదించారు. గతంలో కోవింద్ కమిటీ సిఫారసులకు కూడా కేబినెట్ ఆమోదం ఇచ్చింది. కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం దేశ ప్రజల ఆకాంక్షలను మరింత బలపరచడంలో సహాయపడుతుంది
ఈ నివేదిక రూపకల్పనను 2023 సెప్టెంబర్ 2న ప్రారంభించారు. నిపుణుల ఆధ్వర్యంలో 191 రోజుల కసరత్తు తర్వాత ఈ నివేదిక పూర్తైంది. కోవింద్ కమిటీ మొదటి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను 100 రోజుల్లో నిర్వహించాలని సిఫారసు చేసింది. కోవింద్ కమిటీ నివేదికలో, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం దేశ ప్రజల ఆకాంక్షలను మరింత బలపరచడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఒకే సమయంలో ఎన్నికలు జరిపించడం అభివృద్ధి ప్రదేశాన్ని, సామాజిక ఐక్యతను పెంచి, ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. కోవింద్ కమిటీ ఈ విధంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడింది.
అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం, వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగాలి
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికలను ఈ కమిటీ సూచించింది. ఈ నివేదికలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం, వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగాలని పేర్కొంది. హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కూడా కోవింద్ కమిటీ సూచించింది.