సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 200 నుంచి రూ. 300కి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉజ్వల లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని మరో రూ.100 పెంచినట్లు తెలిపారు. గత నెల రక్షాబంధన్ సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించడంతో సిలిండర్ రూ.900కే అందుబాటులో వచ్చినట్లు తెలిపారు. అయితే, ఉజ్వల లబ్ధిదారులకు ఇది రూ.700కే వస్తుందన్నారు. ఇప్పుడు ఉజ్వల లబ్ధిదారులు సిలిండర్‌పై మరో రూ. 100 అదనపు సబ్సిడీని పొందడం ద్వారా రూ.600కే వస్తుందన్నారు.
కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఆమోదం
తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అలాగే సమ్మక్క సారక్క పేరుతో ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన సభలో తెలంగాణలో పసుపు బోర్డు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉజ్వల లబ్ధిదారులకు అదనపు సబ్సిడీపై కేంద్రం ఈ నిర్ణయ తీసుకుంది.