ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురుయ్యారు. దీంతో హుటాహుటిన మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆమెను దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ వయసు 63 కాగా.. అమె సాధారణ చెకప్ కోసమే ఆస్పత్రిలో చేరినట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే.. కొద్ది సేపటి తర్వాత.. కడుపులో చిన్న ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అధికారిక వర్గాలు తెలిపాయి. 2023-24 కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో నిర్మలా సీతారమన్ తలామునకలై ఉన్నారు.
ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
ఫిబ్రవరి 1, 2023న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పద్దును సిద్ధం చేసే పనిలో నిర్మల నిమగ్నయ్యారు. బడ్జెట్‌కు సంబంధించి నవంబర్ 21-28వరకు వర్చువల్ మోడ్‌లో జరిగిన బడ్జెట్ ప్రీ-బడ్జెట్ సంప్రదింపు సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. 2010లో బీజేపీలో చేరిన నిర్మల అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. నిర్మల సీతారామన్ గతంలో రక్షణ శాఖను కూడా నిర్వహించారు. దీంతో రక్షణ శాఖను నిర్వహించిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 2019 నుంచి ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్‌ను నిర్మల పెళ్లిచేసుకున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదవుకునే రోజుల్లో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.