Page Loader
Finance Commission: ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా..గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు
ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా..గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు

Finance Commission: ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా..గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదల అయ్యాయి. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988.773 కోట్లు విడుదల చేయగా, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నిధులను అందించింది. ఇందులో అన్‌టైడ్ గ్రాంట్స్ కింద రూ.395.5091 కోట్లు, టైడ్ గ్రాంట్స్ కింద రూ.593.2639 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం నిధులు 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, రూ.12,853 గ్రామ పంచాయతీలకు అందవుతాయి.

వివరాలు 

29 అంశాల ఆధారంగా అన్‌టైడ్ గ్రాంట్స్ 

రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 29 అంశాల ఆధారంగా అన్‌టైడ్ గ్రాంట్స్ స్థానిక అవసరాలను పరిష్కరించుకోవడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిధులను వ్యవసాయం, గ్రామీణ గృహనిర్మాణం, పారిశుద్ధ్యం, విద్య వంటి పనుల కోసం ఖర్చు చేయవచ్చు. అయితే, ఈ నిధులను జీతాలు, పరిపాలన ఖర్చుల కోసం ఉపయోగించకూడదు. టైడ్ గ్రాంట్స్‌ని నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, ఓడీఎఫ్, పారిశుద్ధ్యం, మురికినీటి రీసైక్లింగ్, ఇళ్ల నుంచి వెలువడిన వ్యర్థాల శుద్ధికి ఉపయోగించాల్సి ఉంటుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తెలిపిన ప్రకారం, ఈ నిధులు ప్రధానంగా గ్రామీణ స్థానిక సంస్థల అత్యవసర సౌకర్యాలు, మౌలిక వసతులను కల్పించుకోవడానికి ఉపయోగపడతాయి.