కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాండవీయ స్పష్టం చేశారు. చైనా, జపాన్, అమెరికా, బ్రెజిల్ ఇతర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని కోవిడ్ పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఉన్నత ఆరోగ్య అధికారులు, నిపుణులతో మాండవీయ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం మంగళవారమే మార్గదర్శకాలను జారీ చేసినట్లు పవార్ పేర్కొన్నారు.
'ప్రికాషన్ డోసు తీసుకున్నది 28శాతం మందే'
కేవలం 27 నుంచి 28 శాతం మంది మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు. మాండవీయాతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. సీనియర్ సిటిజన్లతో పాటు ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు ఇంటి లోపల కూడా మాస్కులను తప్పనిసరిగా ధరించాలని పాల్ కోరారు. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, వృద్ధులు ఈ విషయాన్నితప్పనిసరిగా గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇదిలా ఉంటే.. కరోనా కేసులకు సంబంధించి.. మంగళవారమే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రతి నమూనాను విశ్లేషించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది.