
Amit Shah: పాకిస్థాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి.. సీఎంలకు అమిత్ షా దిశానిర్దేశం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు చెందిన పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు ముందడుగు వేసింది.
శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ ద్వారా మాట్లాడి,తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ పౌరులను గుర్తించి వెంటనే వెనక్కి పంపించాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థానీయులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
వారంలోపే భారతదేశాన్ని విడిచిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ పరిణామాల మధ్యే తాజాగా రాష్ట్రాలను మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం శాఖ సూచించింది.
ఇదిలా ఉండగా,పలురాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు తమ పరిధిలో ఉన్న పాక్ పౌరులపై నిఘా పెంచాయి.
వివరాలు
హైదరాబాద్ లో 208 మంది పాకిస్థానీయులు
పాకిస్థాన్ పౌరుల సమాచారం సేకరించడంలో పోలీసులు కృషి చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని స్పెషల్ బ్రాంచ్ వద్ద నమోదైన సమాచారం ప్రకారం, మొత్తం 208 మంది పాకిస్థానీయులు నగరంలో ఉన్నట్లు గుర్తించారు.
వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉండగా, 13 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్లు తెలిసింది.
ఈ విదేశీయులను రెండు రోజుల్లో భారతదేశం విడిచి వెళ్ళాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.
నల్ల రిబ్బన్‌లతో మసీదులలో నమాజ్
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ,మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించేందుకు ముస్లింలు మక్కా మసీదులో నల్ల రిబ్బన్‌లు ధరించి నమాజ్‌లో పాల్గొన్నారు.
మరోవైపు, శాస్త్రిపుర ప్రాంతంలోని ఒక మసీదులో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నమాజ్‌కు వచ్చినవారికి నల్లటి రిబ్బన్‌లు పంపిణీ చేశారు.