Page Loader
భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం!
భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా

భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం!

వ్రాసిన వారు Stalin
Mar 20, 2023
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు కిందకు లాగిన ఘటన సంచలనంగా మారింది. భారత హైకమిషన్ల వద్ద భద్రత దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతుందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లోని రాయబార కార్యాలయాలు, దౌత్యవేత్తల భద్రత విషయంలో కేంద్రం విశేషమైన ప్రాధాన్యం కల్పిస్తోంది. ఇతర దేశాలు మాత్రం మన రాయబారుల పట్ల ఆ స్థాయిలో శ్రద్ధ కనబర్చడం లేదు. దిల్లీ చాణక్యపురి ప్రాంతంలోని అమెరికా,యూకే, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, పాకిస్థాన్ వంటి ముఖ్యమైన దేశాల రాయబార కార్యాలయాలు, దౌత్యవేత్తలకు ప్రత్యేకమైన భద్రతను కేంద్రం కల్పిస్తుంది. ఈ ప్రాంతంలోని రహదారులపైకి అన్ని వాహనాలకు ప్రవేశం ఉండదు. 24గంటలు నిఘా నీడలో వారి ఆఫీసులు, నివాస సముదాయాలు ఉంటాయి.

భారత్

చైనా, అమెరికా రాయబార కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలను యూకే జరగనిస్తుందా?

కీలకమైన దేశాల రాయబారులకు కేంద్రమంత్రి హోదా ఇవ్వబడుతుంది. వారు ఎక్కడికెళ్లినా కేంద్రమంత్రి హోదాలో ప్రభుత్వ వర్గాలు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రాయబారులను వీవీఐపీలుగా పరిగణిస్తాయి. ఆయా రాష్ట్రాల్లోని సీఎంలు వారికి ప్రత్యేక భద్రతను కల్పిస్తారు. రాయబారులకు మీడియా విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు ఉండవు. దేశంలో ఎక్కడైనా ఎలాంటి భయం లేకుండా పర్యటించవచ్చు. విదేశాల్లోని రాయబారుల పరిస్థితి అందుకు భిన్నం. పాకిస్థాన్, చైనాతో పాటు మధ్యప్రాచ్య దేశాల్లో అయితే రాయబారులను ఎక్కడికి అనుమతించరు. లండన్‌లోని భారత్ హైకమిషన్ భద్రత పట్ల యూకే చాలా ఉదాసీనతగా వ్యవహరించిందని, అదే చైనా, అమెరికా యూరోపియన్ రాయబార కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలను బ్రిటన్ ప్రభుత్వం జరగనిస్తుందా? అని ఓ మాజీ భారత విదేశాంగ కార్యదర్శి ప్రశ్నించారు.