LOADING...
లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం
భారత జాతీయ జెండాను అగౌరవపర్చేందుకు లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు విఫలయత్నం

లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం

వ్రాసిన వారు Stalin
Mar 20, 2023
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ అరెస్టు కోసం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపునకు నిరసనగా లండన్‌లో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని ఓ నిరసనకారుడు తీసివేసి, దాన్ని విసిరేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అప్రమత్తమైన హైకమిషన్‌లోని ఓ అధికారి భారత జాతీయ జెండాను నిరసనకారుడి నుంచి లాక్కున్నారు. అనంతరం ఆ జెండాను హైకమిషన్‌ కిటికి కట్టారు. ఆందోళనకారుల ప్రయత్నం విఫలమైనట్లు హైకమిషన్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జాతీయ జెండాకు అవమానం జరగకుండా కాపాడిన అధికారిపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

లండన్

హైకమిషన్‌ వద్ద జరిగినపై భారత ప్రభుత్వం సీరియస్

లండన్‌లోని భారత హైకమిషన్‌ వద్ద జరిగిన ఘటనను భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దిల్లీలోని బ్రిటన్ రాయబారికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. భారత హైకమిషన్‌ వద్ద జరిగిన ఘటన పట్ల నిరసనను తెలిపింది. తగిన భద్రత లేకపోవడం వల్లే హైకమిషన్ ప్రాంగణంలోకి నిరసనకారులు వచ్చినట్లు దీనికి వివరణ ఇవ్వాలని బ్రిటన్ రాయబారిని డిమాండ్ చేసింది. బ్రిటన్‌లోని హైకమిషన్ ప్రాంగణం, సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వం ఉదాసీనతగా ఉండటం తగదని విదేశాంగ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనకారులను గుర్తించి, అరెస్టు చేసి, విచారించడానికి యూకే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.