Petrol Prices: పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన.. మంత్రి ఏమన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్,డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. క్రూడాయిల్ ధరలు తగ్గిన ప్రతిసారీ పెట్రోల్,డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని ఆశించిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం,సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించడం సాంకేతికంగా సాధ్యం కాకపోవచ్చని స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో ఎదురవుతున్న అంతరాయాల కారణంగా చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఇప్పటికే రూ.42వేల కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు తెలిపారు.
వివరాలు
ఆ అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది: సురేష్ గోపి
మీనాంబాక్కమ్ విమానాశ్రయం సమీపంలో విలేకరులతో మాట్లాడిన సురేష్ గోపి.. ఇంధన ధరలపై స్పందించారు.
పెట్రోల్, డీజిల్పై విధించే పన్నులను తగ్గించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని పేర్కొన్నారు.
అయితే ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే ముందు చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చమురు సరఫరా, ధరల విషయంలో ఇప్పటికీ సవాళ్లను సృష్టిస్తున్నాయని వివరించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇంధన ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ ధరలు పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు.
వివరాలు
రూ.42 వేల కోట్లకు పైగా నష్టాలు
'వాహనదారులు రేపటికల్లా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలని కోరుకోవచ్చు. కానీ సాంకేతికంగా వెంటనే ధరలు తగ్గించడం సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇప్పటికే రూ.42 వేల కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఆ సంస్థలకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది.' అని కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు.
వివరాలు
పది రోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు పెట్రోల్,డీజిల్ ధరల పెంపు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పది రోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు పెంచింది.
మే 15, 19, 23, 25 తేదీల్లో ధరల పెంపును ప్రకటించింది. దీంతో లీటరు పెట్రోల్, డీజిల్పై వాహనదారులకు సుమారు రూ.7.50 వరకు అదనపు భారం పడింది.
అంతకుముందు చివరిసారిగా 2024 మార్చి 15న పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేంద్రం ఇంధన ధరలను తగ్గించింది.
అప్పట్లో పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2 చొప్పున తగ్గింపు ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.116.15 కాగా.. డీజిల్ ధర రూ.104.23గా ఉంది.
వివరాలు
భారీగా పడిపోయిన అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు
సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం సవరిస్తూ ఉండేది.
అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇతర అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ధరల్లో పెద్దగా మార్పులు చేయడం లేదు.
చమురు కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయనే కారణంతో దేశీయంగా ఇంధన ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నారు.
వివరాలు
భారీగా పడిపోయిన అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.
బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక దశలో 110 డాలర్ల స్థాయిలో ఉండగా.. దాదాపు 20 శాతం తగ్గి 90 డాలర్లకు పడిపోయింది.
ప్రస్తుతం మళ్లీ బ్యారెల్కు 95 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఈ స్థాయిలో తగ్గినప్పటికీ.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి తగ్గింపు ప్రకటించలేదు.
దీంతో ఇంధన ధరల తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న వాహనదారులకు మరోసారి నిరాశే ఎదురవుతోంది.