ఒడిషా ఘటనలో 51 గంటల ఆపరేషన్.. స్వయంగా నడిపించిన రైల్వే మంత్రి
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో 3 రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 288 ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరం. అయితే ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఏ ప్రణాళికలు చేపట్టాలనే అంశంపై రైల్వే శాఖ సర్వసన్నద్ధమై ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారం కూడా ఆ శాఖ వద్ద ఉంటుంది. దీనికితోడు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్వయంగా రంగంలోకి దిగారు. వీలైనన్ని మరణాలను తగ్గించడం, బాధితులకు మెరుగైన చికిత్స, పునరుద్ధరణ పనుల వేగవంతం లాంటివి చేపట్టారు. ఒకప్పుడు ఇదే జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో, 1999లో భారీ తుఫాన్ ముప్పును అశ్విన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా 51 గంటల్లోనే రైలు సేవలను పునరుద్ధరించగలిగారు.
స్వయంగా పర్యవేక్షించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి
రైలు సేవల పునరుద్ధరణలో భాగంగా రైల్వే శాఖ నుంచి 8 బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రతి 2 బృందాలను సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు పర్యవేక్షించారు. వారిపై డివిజనల్ ఆర్ఎం, జీఎం పర్యవేక్షణ కొనసాగింది. వీరు రైల్వే బోర్డు సభ్యులకు జావాబుదారిగా ఉన్నారు. బాధితులను వేగంగా ఆస్పత్రులకు తరలించడం, అక్కడ మెరుగైన చికిత్సలు అందేలా చూడటం లాంటి వాటికి స్వయంగా మంత్రి ఆదేశాలిచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్ ను కటక్ ఆస్పత్రికి, డీజీ హెల్త్ ను భువనేశ్వర్ ఆస్పత్రికి పంపించారు. ప్రమాద స్థలంలో సహాయక కార్యక్రమాల తీరును కెమెరాలతో సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షించి పురోగతిని తాజాగా మంత్రికి అందించారు. ఇలా సమన్వయంతో, సమష్టి కృషితో వేగంగా ఆపరేషన్ ను పూర్తి చేయగలిగారు.