Rahul Gandhi: పార్లమెంట్‌లో రాహుల్ వ్యాఖ్యల దుమారం.. 'ఇడియట్', 'అంధభక్త్' పదాలపై దుమారం
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో బుధవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. విద్యార్థుల నిరసనలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చర్చలో భాగంగా ఇటీవల ఓ 18 ఏళ్ల విద్యార్థినితో తాను జరిపిన సంభాషణను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారని పేర్కొంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొదటి వర్గం విద్యార్థులదని,వారు నిజాన్ని అంగీకరిస్తారని,వినయంగా ఉంటారని చెప్పారు. రెండో వర్గాన్ని'ఇడియట్స్'గా అభివర్ణిస్తూ,తమకే అన్నీ తెలుసన్న భావనతో ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరని వ్యాఖ్యానించారు.
వివరాలు
విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు: రాహుల్ గాంధీ
మూడో వర్గం 'అంధభక్త్'లదని, మరో వ్యక్తిని గుడ్డిగా నమ్మేవారినే అలా పిలుస్తారని అన్నారు.
విద్యార్థులు చేపడుతున్న ఉద్యమానికి భాజపా ఎంపీల కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇస్తారని, వారి ఇంట్లోని పిల్లలను అడిగినా అదే విషయం చెబుతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని, వారి ఉద్యమంపై ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అయితే రాహుల్ గాంధీ ఉపయోగించిన 'ఇడియట్', 'అంధభక్త్' వంటి పదాలపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివరాలు
ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరిన కిరెణ్ రిజిజు
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు వెంటనే స్పందిస్తూ, విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించే సమయంలో అన్‌పార్లమెంటరీగా భావించే పదాలను ఉపయోగించడం సముచితం కాదన్నారు.
ఆ వ్యాఖ్యలను వెంటనే సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ,సభా గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
వివరాలు
అధికార పక్ష సభ్యుల నిరసనలతో సభలో గందరగోళం
ఇదిలా ఉండగా, అధికార పక్ష సభ్యుల నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది.
ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ,సభలో క్రమశిక్షణను కొనసాగించడం స్పీకర్ బాధ్యత అని అన్నారు.
తాను మాట్లాడటం ప్రారంభించిన ప్రతిసారీ అధికార పక్ష సభ్యులు నినాదాలు చేస్తూ అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
దీంతో సభలో కొంతసేపు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగింది.