Uttar pradesh: ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధాలు.. సహారన్‌పూర్ డెంటల్ విద్యార్థి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై,అలాగే వారికి సహకరిస్తున్న అనుచరులపై భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సంబంధాలు కలిగిన ఆన్‌లైన్ నెట్‌వర్క్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఓ యువకుడిని ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉగ్రవాద నిరోధక దళం అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వ్యక్తి 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి హారిష్ అలీగా గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో ఐసిస్ అనుబంధ నెట్‌వర్క్ కార్యకలాపాలపై నిత్యం నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో సహారన్‌పూర్ జిల్లాకు చెందిన హారిష్‌పై అనుమానం కలిగి, అతని కార్యకలాపాలను పరిశీలించారు. సోషల్‌మీడియా వేదికల ద్వారా ఐసిస్‌కు చెందిన హ్యాండ్లర్లు,మద్దతుదారులతో అతనికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
'అల్ ఇత్తిహాద్ మీడియా ఫౌండేషన్' పేరుతో ప్రత్యేక గ్రూప్
బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) రెండో సంవత్సరం చదువుతున్న హారిష్‌ను ఆదివారం అరెస్టు చేశారు. విచారణలో బయటపడిన అంశాల ప్రకారం, ఉగ్ర భావజాలాన్ని ప్రోత్సహించేందుకు, కొత్త వ్యక్తులను ఆకర్షించేందుకు హారిష్ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను వినియోగించి పలు ఆన్‌లైన్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా 'అల్ ఇత్తిహాద్ మీడియా ఫౌండేషన్' పేరుతో ప్రత్యేక గ్రూప్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న ఐసిస్ అనుబంధ వ్యక్తులతో కూడా అతను నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తును అధికారులు కొనసాగిస్తున్నారు.