Cyclone Montha: పంజా విసిరిన తుపాను.. పలు జిల్లాల్లో విరిగిపడిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు
ఈ వార్తాకథనం ఏంటి
కాకినాడ తీరానికి సమీపంగా మంగళవారం రాత్రి మొంథా తుపాన్ తీరం దాటింది. ముందుగా హెచ్చరించినంత తీవ్రంగా లేకపోయినా, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు విస్తార ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు విరుచుకుపడ్డాయి. మొత్తం 22జిల్లాల్లోని 403 మండలాలు తుపానుతో ప్రభావితమయ్యాయని ప్రభుత్వం తెలిపింది. 1,204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 75,802 మందిని అక్కడికి తరలించారు. వారికి ఆహారం, తాగునీరు, అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, ఉద్యాన పంటలు నష్టపోయాయి. తుపాను తాకిడితో మంగళవారం ఉదయం నుంచే తీరప్రాంతాల్లో అలలు ఉద్ధృతంగా మోగాయి. వేగంగా వీచిన గాలుల కారణంగా తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో వందలాది చెట్లు నేలకూలాయి.
వివరాలు
యరజర్ల-వెంగముక్కలపాలెం వాగులో కొట్టుకుపోయిన కారు
సహాయక సిబ్బంది వాటిని తొలగించి రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు స్తంభాలు విరిగిపడిన చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టారు. రాత్రి 7గంటల తర్వాత తీరప్రాంత జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం మాకనపాలెంలో తాటిచెట్టు కూలి ఒక మహిళ మృతి చెందగా,కృష్ణా జిల్లా కృత్తివెన్నులో కొబ్బరిచెట్టు పడి ఒకరు గాయపడ్డారు. ప్రకాశం జిల్లాలో యరజర్ల-వెంగముక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది. విజయవాడలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రాజకీయపార్టీలు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాయి. మంగళవారం ఉదయం 8.30గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నెల్లూరు జిల్లా కావలిలో 17.2 సెం.మీ,ఉలవపాడు 17.0,దగదర్తి 15.6,జలదంకి 14.1,ప్రకాశం జిల్లా పాకలలో 13.8సెం.మీ వర్షపాతం నమోదైంది.
వివరాలు
పంటలకు తీవ్ర నష్టం - నేలవాలిన వరి పొలాలు
తుపాను ప్రభావంతో కోత దశలో ఉన్న వరి పొలాలు నీటమునిగాయి. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 35వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కృష్ణా జిల్లాలో వరి, అరటి, బొప్పాయి తోటలు నేల వాలగా, ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో, విజయనగరం జిల్లాలో 12 మండలాల్లో 7వేల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తీత దశలో ఉన్న పత్తి వర్షాలకు తడిసి నాణ్యత కోల్పోయింది. గింజ దశలో ఉన్న వరి గాలుల తీవ్రతతో నేలకొరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
దెబ్బతిన్న 875 హెక్టార్ల వరి, 107 హెక్టార్ల మినుము పంటలు
వాగుల వద్ద ఉన్న మిరప తోటలు నీట మునుగుతాయేమోనన్న భయం నెలకొంది. మొక్కజొన్న, కంది, వేరుసెనగ, అపరాల పంటలు కూడా వర్షాలకు తీవ్ర దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో చల్లపల్లి, మోపిదేవి, తోట్లవల్లూరు మండలాల లంక గ్రామాల్లో బొప్పాయి, అరటి పంటలు నష్టపోయాయి. 875 హెక్టార్ల వరి, 107 హెక్టార్ల మినుము పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. మొవ్వ మండలం పెదముత్తేవి, కోసూరు, బుద్దాలపాలెం ప్రాంతాల్లో వరి పంటలు ఎక్కువగా నాశనమయ్యాయి.
వివరాలు
ప్రకాశం: స్తంభించిన జనజీవనం
ప్రకాశం జిల్లా అంతటా కుండపోత వానలతో ప్రజల జీవితం స్తంభించింది. తీర మండలాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంభం, కనిగిరి ప్రాంతాల్లో కొన్నిచోట్ల మట్టిమిద్దెలు కూలిపోయాయి. ఒంగోలులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర పరిసర గ్రామాలు నీట మునిగిపోయాయి. మొత్తం 2,377 మందిని 54 పునరావాస కేంద్రాలకు తరలించారు. స్తంభాలపై చెట్ల కొమ్మలు పడటంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. సింగరాయకొండ మత్స్యకార గ్రామాల్లో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ప్రత్యేకాధికారి కోన శశిధర్ ప్రజలను అప్రమత్తం చేశారు.
వివరాలు
శ్రీకాకుళం జిల్లా: వానతో తంటా
శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచే భారీవర్షం కురుస్తోంది. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. వజ్రపుకొత్తూరు మండలం పెద్దబడాం వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. సోంపేట బారువా వద్ద ఓపెన్ ఛానల్ కొట్టుకుపోయింది. వంశధార, నాగావళి, బాహుదా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యకార గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 80 పునరావాస, 41 తుపాను కేంద్రాలు సిద్ధం చేశారు. ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. కొన్ని మండలాల్లో మట్టి ఇళ్లు కూలిపోయాయి.
వివరాలు
గుంటూరు, పల్నాడు, బాపట్ల: తెరిపిలేని వర్షం
మంగళవారం ఉదయం నుంచి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. తీర, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుంటూరులో 99 కేంద్రాల్లో 5,983 మందికి, బాపట్లలో 115 కేంద్రాల్లో 5,772 మందికి, పల్నాడులో 50 కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు. అధికారులు జిల్లాల వారీగా సమన్వయం కొనసాగిస్తున్నారు. అవసరమైతే అందరికీ ఆహారం, పాలు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నాటికి గుంటూరులో గాలుల తీవ్రత పెరిగింది. నగరంలో 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 25 కేంద్రాల్లో 2,000 మందికి ఆశ్రయం కల్పించారు.
వివరాలు
కృష్ణా జిల్లా: కెరటాల అలజడి..
కృష్ణా జిల్లాలో ఈదురుగాలులు తీవ్రంగా వీచాయి. నాగాయలంక, మచిలీపట్నం, కృత్తివెన్ను, గన్నవరం మండలాల్లో చెట్లు కూలాయి. గంటకు 93 కిమీ వేగంతో గాలులు వీచడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మంగినపూడి తీరంలో సముద్రం ముందుకు వచ్చి బీచ్ మూసివేశారు. హంసలదీవి, చినగొల్లపాలెం, పెదపట్నం వంటి తీర గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం 177 కేంద్రాల్లో 11,317 మంది ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని కేంద్రాల్లో పాలు, గుడ్లు అందక గర్భిణులు ఇబ్బంది పడ్డారు.
వివరాలు
రాష్ట్రవ్యాప్త పరిస్థితి
తుపాను ప్రభావిత జిల్లాలు: 22 ప్రభావిత మండలాలు: 403 ప్రజలకు పంపిన హెచ్చరిక సందేశాలు: 3.6 కోట్లు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు: 1,204 కేంద్రాల్లో ఉన్న ప్రజలు: 75,802 కంట్రోల్ రూములు: 488 వైద్య శిబిరాలు: 219 అత్యవసర కమ్యూనికేషన్ టవర్లు: 81 డ్రోన్లు, జేసీబీలు, క్రేన్లు సహా పరికరాలు: 1,768
వివరాలు
గర్భిణుల రక్షణపై ప్రత్యేక చర్యలు
ప్రసవ తేదీ సమీపించిన గర్భిణులను ప్రభుత్వం ముందస్తుగా గుర్తించి ఆసుపత్రులకు తరలించింది. మంగళవారం సాయంత్రం నాటికి 2వేల మందికి పైగా గర్భిణులను సమీప ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు మన్య ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సులు, మైదాన ప్రాంతాల్లో 108, 104 వాహనాలను సిద్ధం చేశారు. హైరిస్క్ కేసులను జిల్లా ఆసుపత్రులు, జీజీహెచ్‌లకు పంపించారు. మొత్తం వైద్యసిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.