Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు
కొన్ని ప్రాంతాల్లో మత విద్వేషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. మతం అనేది తమ సంస్థకు ఆస్తిగా కొందరు భావిస్తున్నారు. ఈ భావన వల్ల కొన్ని అనూహ్య, విచిత్ర ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఘటనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధార్థనగర్(Siddharthnagar)లో జరిగింది. యూపీ(Uttar Pradesh)లోని సిద్ధార్థనగర్ జిల్లా బల్వా గ్రామంలోని సామ్య మాత ఆలయ నిర్వాహకులు 'రామ్ కథ' ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దుమారియాగంజ్(Domariaganj) ఎస్పీ ఎమ్మెల్యే సయ్యదా ఖాతూన్(Saiyada Khatoon)ను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సయ్యదా ఖాతూన్ హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆలయం నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్, కొన్ని ఇతర హిందూ సంస్థల సభ్యులు గుడిని సందర్శించారు.
ఎమ్మెల్యే రావడంతో ఆలయ పవిత్రత తిన్నది: పంచాయతీ అధ్యక్షుడు
పంచాయతీ ప్రెసిడెంట్, హిందూ సంస్థలు ఆలయంలో గంగాజలం చల్లి, హనుమాన్ చాలీసా పారాయణం చేసి, సయ్యదా ఖాతూన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయమై బధ్ని చాఫా నగర్ పంచాయతీ అధ్యక్షుడు ధరమ్‌రాజ్ వర్మ మాట్లాడుతూ.. సామ్యమాత దేవాలయం అంటే భక్తులకు ఎంతో విశ్వాసమన్నారు. మాంసాహారి అయిన ఎమ్మెల్యే సందర్శన వల్ల ఈ ప్రదేశం పవిత్రత తిన్నట్లు చెప్పుకొచ్చారు. నగరపంచాయతీ అధ్యక్షుడు ధరమ్‌రాజ్ చేసిన ఈ ప్రకటనను పలువురు వ్యతిరేకిస్తున్నారు. హిందువు అయినా, ముస్లిం అయినా ఎవరైనా మాంసాహారం తీసుకోవచ్చని ప్రజలు అంటున్నారు. ఆలయానికి వచ్చే వారిని మాంసాహారో, శాకాహారో ఎలా గుర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు.