Yogi Adityanath: బుల్డోజర్ చర్యను సమర్థించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
రాష్ట్రంలోని నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ చర్యను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు. అభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రముఖ న్యూస్ ఎజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో యోగి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బుల్‌డోజర్‌లు, ఆధునిక యంత్రాలు అవసరమని అన్నారు. 'ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి చర్యలు అనివార్యం అన్నారు. ఇంతకుముందు ఏదైనా అభివృద్ధి పని ఆమోదం పొందిన వెంటనే మాఫియా వచ్చి అక్రమంగా లాక్కునేవని, గత ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేదన్నారు. తమ ప్రభుత్వం వారికి బుల్‌డోజర్‌లతో సమాధానం చెబుతోందన్నారు.
ప్రభుత్వ ఆస్తులను లాక్కున్న వారికి హారతులు ఇవ్వాలా?: యోగి
ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా లాక్కొన్న నేరస్థుల ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చకుండా వారికి హారతి ఇవ్వలా? అని యూపీ సీఎం యోగి ప్రశ్నించారు. నేరస్తులు, మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నట్లు యోగి చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం మైనారిటీ వర్గాలకు చెందిన నేరస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. మతంతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన పాలన అందరికీ సమానమని, రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించడమే తమ ఉద్దేశం అని ఆదిత్యనాథ్ అన్నారు. వందేమాతరానికి మతాన్ని ముడిపెట్టడంపై అడిగిన ప్రశ్నకు ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని, ఏ మతం ఆధారంగా నడవదన్నారు.