Uttarakhand tunnel: రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకు రావొచ్చు.. లేకుంటే..
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుపోయి 10 రోజులు అవుతోంది. వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మరో రెండు రోజుల్లో డ్రిల్లింగ్ మిషన్ల సహాయంతో కార్మికులను బయటకు తీసుకురావొచ్చని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే డ్రిల్లింగ్ ప్లాన్ సక్సెస్ కాకపోతే.. కార్మికులను రక్షించడానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. నవంబర్ 12న సొరంగం కుప్పకూలి అప్పటి నుంచి కార్మికులు అందులోనే మగ్గుతున్నారు. వారికి స్టీల్ పైపుల ద్వారా ఆహారం, నీరు, మందులు సరఫరా చేస్తున్నారు.
మరో ఐదు ప్రణాళికలను సిద్ధం చేశాం: రోడ్డు రవాణా, హైవేస్ సెక్రటరీ
ప్రస్తుతం డ్రిల్లింగ్ కోసం అమెరికాలో తయారైన అత్యాధునిక అగర్ డ్రిల్లింగ్ మెషిన్ మిషన్‌ను వినియోగిస్తున్నట్లు రోడ్డు రవాణా, హైవేస్ సెక్రటరీ అనురాగ్ జైన్ వెల్లడించారు. ఇది ఉత్తమ ఎంపిక అన్నారు. మరో 2.5 రోజుల్లో కార్మికులు బయటకు రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగర్ మిషన్ శుక్రవారం మధ్యాహ్నం డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో గట్టి బండరాయిని ఢీకొట్టండంతో ప్రకంపనలు సంభవించాయి. తర్వాత భద్రతా కారణాల రీత్యా తర్వాత డ్రిల్లింగ్‌ను అధికారులు ఆపేశారు. కార్మికులను రక్షించేందుకు తాము మరో ఐదు ప్రణాళికలను సిద్ధం చేశామని, అవి పూర్తవడానికి మరో 12-15 రోజులు పట్టవచ్చని జైన్ వెల్లడించారు.