LOADING...
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి .. సీఎస్ గా నియమితులైన ఓరుగంటి శ్రీనివాస్
సీఎస్ గా నియమితులైన ఓరుగంటి శ్రీనివాస్

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి .. సీఎస్ గా నియమితులైన ఓరుగంటి శ్రీనివాస్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలుగు వాడైన ఓరుగంటి శ్రీనివాస్‌ను నియమించారు. ఇప్పటివరకు కేంద్రంలో పరిపాలనా సంస్కరణలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖల కార్యదర్శిగా పనిచేసిన ఆయనను, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు దిల్లీ నుంచి స్వరాష్ట్ర క్యాడర్‌కు మార్చిన వెంటనే సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న ఆయన విధులు చేపట్టనున్నారు. శ్రీనివాస్‌ 1966 సెప్టెంబరు 1న అరకు లోయలో జన్మించారు. ఆయన తండ్రి అక్కడ జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌గా పనిచేస్తుండటం వల్ల వారి కుటుంబం పుష్కర కాలం పాటు అరకు, తరువాత తెలంగాణలోని దుమ్ముగూడెం ప్రాంతాల్లో నివసించారు.

వివరాలు 

2026 సెప్టెంబరు వరకు రాజస్థాన్‌ సీఎస్‌గా..

భద్రాచలం పంచాయతీ పాఠశాలలో చదువు పూర్తి చేసిన ఆయన, తరువాత ఒస్మానియా విశ్వవిద్యాలయంలో 1987లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌, 1989లో ఎంటెక్‌ పూర్తిచేశారు. తర్వాత ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. ఆయన 2026 సెప్టెంబరు వరకు రాజస్థాన్‌ సీఎస్‌గా కొనసాగుతారు. అరకులోయ గిరిజనులతో తన చిన్ననాటి అనుబంధం గురించి ఆయన ఇటీవల ప్రచురించిన టువర్డ్స్‌ ఏ న్యూ ఇండియా పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదనంగా, జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు పొందారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మనుమరాలిని ఆయన వివాహం చేసుకున్నారు.

వివరాలు 

చంద్రబాబు సేవలకు సెల్యూట్‌ అంటూ వ్యాఖ్యలు 

విశాఖపట్నంలో సెప్టెంబరు 22-23 తేదీల్లో జరిగిన 28వ నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌ కాన్ఫరెన్స్‌లో శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. ''90వ దశకం నుంచే స్మార్ట్‌ గవర్నెన్స్‌కు మీరు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ వ్యవస్థల పనితీరును మార్చి కోట్ల మందికి లాభం చేకూర్చింది. నేను అండర్‌ సెక్రటరీగా పనిచేసిన సమయంలో మీరు ముఖ్యమంత్రి. ఇప్పుడు 37 సంవత్సరాల సేవ పూర్తిచేసుకుంటున్న ఈ దశలో కూడా మీరు ముఖ్యమంత్రిగానే ప్రజల సేవ చేస్తున్నారు. దేశానికి చేసిన మీ సేవలకు మా సెల్యూట్‌ స్వీకరించండి'' అంటూ ఆయన ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.