LOADING...
Gannavaram: సత్యవర్ధన్‌ అపహరణ కేసులో కీలక మలుపు.. వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులు అరెస్టు
వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులు అరెస్టు

Gannavaram: సత్యవర్ధన్‌ అపహరణ కేసులో కీలక మలుపు.. వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులు అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

సత్యవర్ధన్‌ను అపహరించి దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ అనుచరుడిగా గుర్తించబడిన యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్‌ రాము, అలియాస్‌ పొట్టి రాము (ఏ-9)ను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని అతని నివాసంలో గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత పది నెలల కాలంగా పోలీసుల చెర నుంచి తప్పించుకొని అజ్ఞాతంలో తిరిగిన ఈ నిందితుడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. విచారణ పూర్తయ్యాక శుక్రవారం ఆయనను ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చే అవకాశం ఉంది.

వివరాలు 

కిడ్నాప్‌ వ్యవహారంలో కీలక పాత్ర 

తెదేపా కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి, కేసును ఉపసంహరించుకునేలా బాధితుడు సత్యవర్ధన్‌ను బెదిరించడంలో రామాంజనేయులు కీలకంగా వ్యవహరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సత్యవర్ధన్‌ను హనుమాన్‌ జంక్షన్‌కు తీసుకెళ్లి అక్కడ తీవ్రంగా బెదిరించి, పలు వాంగ్మూలాలకు సంతకాలు తీసుకున్నాడు. తదుపరి రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లి, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని న్యాయాధికారి ఎదుట బాధితుడితో వాంగ్మూలం ఇప్పించాడు. ఫిబ్రవరి 10న సత్యవర్ధన్‌ను హైదరాబాద్‌కు తరలించి,మై హోమ్‌ బుజా అపార్ట్‌మెంట్‌లో వల్లభనేని వంశీని కలిపించాడు.

వివరాలు 

వైకాపా పాలనలో గన్నవరంలో అక్రమాలు 

అదే రాత్రి అక్కడే ఉంచి బెదిరింపులకు గురిచేశారు. అనంతరం ఫిబ్రవరి 11న ఏపీ-40 బీజీ-5005 నంబరున్న కారులో మిగతా నిందితులతో కలిసి బాధితుడిని విశాఖపట్నంకు తీసుకెళ్లినట్టు నమోదుైంది. వైకాపా ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతని రాజకీయ పలుకుబడిని ఆసరాగా చేసుకుని రామాంజనేయులు పలు అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి. బాపులపాడు మండలం బొమ్ములూరు గ్రామానికి చెందిన ఈ వ్యక్తి, సీఆర్డీఏ అనుమతులు లేకుండానే బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో కుప్పలుగా లేఅవుట్లు వేసి, వాటిని అమ్మి భారీగా సొమ్ము కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

వివాదాస్పదమైన ఆస్తులను ముందే గుర్తించి..

నియోజకవర్గంలో వేసిన జగనన్న కాలనీల కోసం సేకరించిన భూముల విషయంలో భారీగా దండుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు - రైతుల మధ్య మధ్యవర్తిగా పనిచేస్తూ లాభాలు పొందడమే కాకుండా, అంపాపురంలో నిర్వహించిన సంక్రాంతి జూద శిబిరానికి ఏర్పాట్లలో కీలక పాత్ర వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పదమైన ఆస్తులను ముందే గుర్తించి తక్కువ ధరలకు చేజిక్కించుకునే పద్ధతిని సైతం అవలంబించేవాడని సమాచారం.

Advertisement