కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వనమాపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. వనమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన ఆస్తుల వివరాలను సరిగా వెల్లడించలేదని, 2018 ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి జలగం వెంకటరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అఫిటవిట్‌లో పేర్కొననందున ఆయన ఎన్నిక చెల్లుబాటు కాదని జులై 25న హైకోర్టు పేర్కొంది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే క్రమంలో వనమా ప్రతివాదులు రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.