
Vegetable prices: తెలంగాణాలో ఆకాశానంటిన కూరగాయలు.. గతేడాదితో పోలిస్తే 10 శాతం పెరిగిన ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
బీన్స్ కిలో రూ.90, క్యాప్సికం రూ.80, చిక్కుడు రూ.75, పచ్చిమిర్చి రూ.60...ఇవే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కూరగాయల ధరలు. రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో ధరలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే కూరగాయల ధరలు సుమారు 10 శాతం పెరిగినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 12.94 లక్షల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు,పండ్ల సాగు జరుగుతుంది. ఈ సాగులో 60 శాతం వానాకాలం సీజన్‌కి ముందే,అంటే ఏప్రిల్‌లోనే ప్రారంభమై,జూన్ నాటికి పంట చేతికొస్తుంది. అందువల్ల అప్పట్లో ధరలు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా జూలై నెలలో ధరలు మరింత తగ్గుతుంటాయి.
వివరాలు
వానాకాలం సీజన్‌లో సుమారు 6 లక్షల ఎకరాల్లో కూరగాయలు
కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో సాగు అనుకూలంగా సాగినప్పటికీ, జూన్‌లో వర్షాభావం ఏర్పడటం ధరల పెరుగుదలకు కారణమైంది. టమాటా, బెండ, కాకర, గోరుచిక్కుడు, దోసకాయ, బీర, దొండకాయ పంటలు వర్షాభావంతో నష్టపోయాయి. దిగుబడి తక్కువగా రావడంతో మార్కెట్లో సరఫరా తగ్గిపోయింది. వానాకాలం సీజన్‌లో సుమారు 6 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగవ్వాలి. కానీ ఈసారి కేవలం 4.2 లక్షల ఎకరాల వరకు మాత్రమే సాగు జరిగింది. సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో సుమారు 30 శాతం మేర పంటల సాగు తగ్గిపోయింది. అందుబాటులో ఉన్న దిగుబడితో డిమాండ్‌ను తీరచేయలేకపోవడంతో జూన్ నెల నుంచే ధరలు భారీగా పెరిగాయి.
వివరాలు
శ్రావణ మాసంలో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం
ప్రస్తుతం ఈ ధరల పెరుగుదల మరింత తీవ్రమవుతోంది. రాష్ట్రంలో సరఫరా తగ్గడంతో వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. కానీ మార్కెట్లు, దుకాణాల్లో ఈ దిగుమతుల్ని రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. రాబోయే శ్రావణ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అభిప్రాయంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
వివరాలు
నెల రోజుల్లోనే కూరగాయల ధరలు రెట్టింపు
రైతు బజార్లలో కూరగాయల ధరలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే గణనీయంగా పెరిగిపోయాయి. జూన్ 14న బీన్స్ ధర కిలోకు రూ.55గా ఉండగా, జులై 14 నాటికి అది రూ.90కి పెరిగింది. క్యాప్సికం ధర రూ.55 నుంచి రూ.80కి, చిక్కుడు ధర రూ.50 నుంచి రూ.75కి, పచ్చిమిర్చి ధర రూ.45 నుంచి రూ.60కి, బజ్జీ మిర్చి ధర రూ.35 నుంచి రూ.55కి, బెండకాయ ధర రూ.35 నుంచి రూ.45కి పెరిగినట్టు గణాంకాలు చూపిస్తున్నాయి.