
Tirumala : రేపు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు రాక
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బుధవారం సాయంత్రం తిరుమలకు రానున్నారు. అలాగే ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు తిరుమలకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా తిరుమలలో పాల్గొననుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా ఇద్దరు ప్రముఖులు వరుసగా రేపు, ఎల్లుండి తిరుమలలోనే ఉండబోతున్నందున భద్రతా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది.
Details
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కమిషనర్ మౌర్య ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలపై సమీక్ష జరిగింది. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, శ్రీవారి ఆలయం, వాహన మండపం, అతిధి గృహం పరిసరాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ విజయ శేఖర్‌కు ప్రత్యేక సూచనలు అందించారు. ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి పర్యటన మొత్తం పోలీసుల పర్యవేక్షణలో సాగనుంది. బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా జరగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం.