Cyclone Montha: పునరావాస కేంద్రాలకు బాధితులు.. పకడ్బందీగా సహాయక చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ నేపథ్యంలో పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. నందివాడ మండలం జనార్దనాపురంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై సహాయక చర్యలపై స్పష్టమైన సూచనలు చేశారు. పాత, కూలే పరిస్థితిలో ఉన్న ఇళ్ల వివరాలను తక్షణం సేకరించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం చూపిన తహసీల్దార్ గురుమూర్తిపై కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే చర్యలు వేగవంతం చేయాలని గట్టిగా ఆదేశించారు. గత తుపానుల్లో బుడమేరు వాగు ఉప్పొంగి పుట్టకుంట కాజువే రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో, ఈసారి ఆ సమస్యలు పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
వివరాలు
జిల్లాలో వర్షపాతం వివరాలు
సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో సగటున 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కృత్తివెన్నులో 17.4 మి.మి., గుడ్లవల్లేరు 15.4, పామర్రులో 12.8, మచిలీపట్నంలో 9.8, అత్యల్పంగా బాపులపాడులో 4.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అధికారులు పరిశీలనలు తుపాను పర్యవేక్షణాధికారి కాటా ఆమ్రపాలి, జాయింట్ కలెక్టర్ నవీన్ గిలకలదిండి, మంగినపూడి బీచ్ ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. గరాలదిబ్బ పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఆమె, అక్కడ ఆశ్రయం పొందిన ప్రజలతో మాట్లాడి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
వివరాలు
మంగినపూడి బీచ్ వద్ద అలల తీవ్రత
జిల్లా స్థాయిలో సహాయక చర్యలు కంట్రోల్ రూములు ఏర్పాటు చేసిన మండలాలు: 26 ప్రభావిత గ్రామాలు: 232 ప్రభావిత ప్రజల సంఖ్య: 32,764 ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు: 189 ప్రస్తుతం ఆశ్రయం పొందిన వారు: 1,482 సిద్ధంగా ఉన్న నీటి ట్యాంకర్లు: 28 మచిలీపట్నం జిల్లా ప్రత్యేకాధికారి ఆమ్రపాలి సోమవారం గరాలదిబ్బ, గిలకలదిండి పునరావాస కేంద్రాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి మంగినపూడి బీచ్ వద్ద అలల తీవ్రతను పరిశీలించారు. జేసీ నవీన్ మాట్లాడుతూ.. "ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ తిరిగి రప్పించాం. జిల్లాలో మొత్తం 189 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి," అని తెలిపారు.
వివరాలు
"ప్రాణనష్టం జరగకూడదు": జోనల్ అధికారి సిసోదియా
తుపాను పరిస్థితులపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన తుపాను జోనల్ ప్రత్యేకాధికారి సిసోదియా మాట్లాడుతూ, "జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలి. చిన్నారులు, బాలింతలు, వృద్ధులు, కిడ్నీ రోగులను ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఆహారం, తాగునీరు, వాడుక నీరు, మందులు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, నిత్యావసర వస్తువులు వంటి సదుపాయాల్లో ఎలాంటి లోపం రాకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి" అని సూచించారు.
వివరాలు
రైతులకు హెచ్చరిక
"వాతావరణ శాఖ సూచనల ప్రకారం అక్టోబర్ 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇప్పుడే వరి కోతలు ప్రారంభించకూడదు. ఇప్పటికే కోత కోసినవారు ధాన్యం మొలకెత్తకుండా ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలి. ప్రజలు కూడా అవసరం లేనప్పుడు బయటకు రాకూడదు" అని జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు.
వివరాలు
ప్రజలకు కలెక్టర్ సూచనలు
కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ, "జిల్లాలో ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముంపు లేదా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే పునరావాస కేంద్రాలకు రావాలి. బలహీనమైన గోడలు, పిట్టగోడల ఇళ్లలో ఉండటం ప్రమాదకరం. బలమైన భవనాల్లో ఉన్నవారు కూడా తుపాను పూర్తిగా తగ్గే వరకు ఐదు-ఆరు గంటలు బయటకు రావొద్దు. ఆహారం, మందులు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలి," అని ప్రజలకు సూచించారు.