Tamilnadu: రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెర.. విజయ్ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్.. రేపే ప్రమాణస్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. తాజాగా సీపీఐ, సీపీఎం, వీసీకే కూడా మద్దతు తెలపడంతో విజయ్ అవసరమైన మెజార్టీ సాధించారు. ఈ నేపథ్యంలో విజయ్ శుక్రవారం సాయంత్రం లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మరోసారి కలిశారు. మూడు రోజుల వ్యవధిలో మూడోసారి గవర్నర్‌ను కలిసిన ఆయన, తమకు మద్దతు తెలిపిన పార్టీల లేఖలను అందజేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు.
వివరాలు
వామపక్ష పార్టీలకు విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు
అనంతరం గవర్నర్ అంగీకారం తెలపడంతో శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలకు విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు వెళ్లి ఆ పార్టీ నేతలను కలిసి ధన్యవాదాలు చెప్పారు. టీవీకేకు కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం పూర్తిగా సుగమమైంది. ప్రస్తుతం పార్టీల బలం పరిశీలిస్తే టీవీకేకు 107 స్థానాలు ఉండగా, కాంగ్రెస్‌కు 5, సీపీఐకి 2, సీపీఎంకు 2, వీసీకేకు 2 స్థానాలు ఉన్నాయి.
వివరాలు
బలపరీక్షలో టీవీకేకు అనుకూలంగా ఓటు వేస్తాం: సీపీఎం
అయితే తాము ప్రభుత్వంలో భాగం కాబోమని, బయట నుంచే మద్దతు ఇస్తామని సీపీఎం నేత యు. వాసుకి స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ.. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు సమావేశమై టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో టీవీకేకు అనుకూలంగా ఓటు వేస్తామని, కానీ మంత్రివర్గంలో మాత్రం చేరబోమని వెల్లడించారు. వామపక్షాలు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని వీసీకే కూడా తెలిపిందని ఆమె అన్నారు.
వివరాలు
ప్రజా సమస్యల విషయంలో మాత్రం స్వతంత్ర వైఖరితో పనిచేస్తాం:సీపీఎం
ప్రజలు టీవీకేకు స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారని, ఆ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల విషయంలో మాత్రం స్వతంత్ర వైఖరితో పనిచేస్తామని చెప్పారు. లౌకికవాదం, ప్రజల ఐక్యత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో ఏ లౌకిక పార్టీతోనైనా కలిసి ముందుకు సాగుతామని యు. వాసుకి వివరించారు.