Tamil Nadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం,సాధికారతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో కాన్పు సమయంలోనూ 365 రోజుల ప్రసూతి సెలవు అందించనుంది. ఇప్పటివరకు తొలి రెండు కాన్పులకు మాత్రమే ఏడాది పాటు ప్రసూతి సెలవు వర్తించగా.. తాజాగా ఈ సదుపాయాన్ని మూడో కాన్పుకూ విస్తరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఇద్దరి కంటే తక్కువ మంది పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు మంజూరవుతోంది. అయితే, ఇప్పటికే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు మూడో కాన్పు సమయంలో కేవలం 12 వారాల సెలవు మాత్రమే అందుతోంది.
వివరాలు
మూడో కాన్పుకు కూడా 365 రోజుల ప్రసూతి సెలవు ప్రకటన
తాజాగా ఈ నిబంధనను మార్చిన ప్రభుత్వం.. మూడో కాన్పుకు కూడా పూర్తిగా ఏడాది పాటు సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది.
రాష్ట్ర అసెంబ్లీలో నిన్న తన శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు.
మహిళా సంక్షేమం, సాధికారతకు తమిళనాడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.
ఇందులో భాగంగానే మూడో కాన్పుకు ప్రస్తుతం ఇస్తున్న 12 వారాల ప్రసూతి సెలవును 365 రోజులకు పెంచుతున్నట్లు సభకు వెల్లడించారు.
తమిళనాడులో ప్రసూతి సెలవుల వ్యవధిని పెంచడం ఇదే తొలిసారి కాదు. 2011కు ముందు 90 రోజులుగా ఉన్న ప్రసూతి సెలవును ఆ ఏడాది ఆరు నెలలకు పెంచారు.
వివరాలు
ఇప్పటివరకు 12 వారాలుగా ఉన్న సెలవును ఏడాదికి పెంపు
2016లో మరోసారి పెంచి తొమ్మిది నెలలకు చేశారు. అనంతరం 2021 జులైలో అప్పటి ప్రభుత్వం ప్రసూతి సెలవును ఏడాదికి అంటే 365 రోజులకు పొడిగించింది.
అయితే ఈ సదుపాయం తొలి రెండు కాన్పులకు మాత్రమే వర్తించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మూడో కాన్పుకు మాత్రం 12 వారాల సెలవు కొనసాగింది.
తాజా నిర్ణయంతో మూడో కాన్పుకు ఉన్న ఈ పరిమితి తొలగిపోనుంది.
కొత్త నిబంధనను అమలు చేసేందుకు అవసరమైన పూర్తి వివరాలతో త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది మహిళా ఉద్యోగులకు ప్రయోజనం కలిగించడంతో పాటు.. మూడో కాన్పు సమయంలో వారికి గణనీయమైన ఊరటనివ్వనుంది.