Vijay: 'ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం'.. గవర్నర్‌కు టీవీకే అధినేత విజయ్ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సినీనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7వతేదీన కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ పార్టీని ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేను రోజుల్లో శాసనసభలో తమ బలాన్ని నిరూపిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న గవర్నర్ బుధవారం చెన్నైకు చేరుకున్న వెంటనే విజయ్ బృందం ఆయనను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరపనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
శాసనసభా పక్ష నేతగా ఎన్నిక
ఇదిలా ఉండగా, చెన్నై సమీపంలోని పనైయూర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో విజేతలైన ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. అనంతరం ఆయనను శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏర్పడే వరకు ఎమ్మెల్యేలను సురక్షితంగా ఉంచేందుకు మామల్లపురంలోని ఓ ప్రముఖ హోటల్‌ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రజల తీర్పును గౌరవిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని తమ రాష్ట్ర కమిటీకి సూచించినట్లు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం వెల్లడించింది. మొత్తం 234 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, టీవీకేకు 108 మంది సభ్యులే ఉన్నారు.
వివరాలు
విజయ్‌కి కాంగ్రెస్ మద్దతు!
కాంగ్రెస్ ఐదుగురు సభ్యుల మద్దతు లభించినా, ఇంకా ఐదుగురిని సమీకరించాల్సి ఉంటుంది. దీనికోసం ఇతర పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక అధికార డీఎంకే పార్టీ ఓటమి చెందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఎం.కె. స్టాలిన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు బాధ్యతలు కొనసాగించాలని గవర్నర్ ఆయనను కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ మొదటిసారిగా స్పందిస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తమ లక్ష్యమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. కేంద్రం సహకారం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తమ విజయాన్ని అభినందించిన ప్రధానమంత్రి,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.