Tamil Nādu: ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు జోసెఫ్ విజయ్ తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతోనే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్ల సమీపంలో కొనసాగుతున్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 4,765 టాస్మాక్ మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటిలో మూసివేతకు ఎంపిక చేసిన 717దుకాణాల్లో 276దేవాలయాలు, ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్నాయి. అలాగే 186 దుకాణాలు విద్యాసంస్థల దగ్గర, మరో 255 దుకాణాలు బస్టాండ్ల పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
మహిళల భద్రతకు ప్రత్యేక భద్రతా దళం
సున్నిత ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సామాజిక ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొత్త ప్రభుత్వం వెల్లడించింది. ప్రజా సంక్షేమం, సామాజిక బాధ్యతల దృష్ట్యా మద్యం నియంత్రణపై కఠిన చర్యలు చేపట్టనున్న సంకేతాలను విజయ్ ప్రభుత్వం ఇచ్చింది. ఇదే సమయంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ప్రతిపాదనకు సంబంధించిన దస్త్రంపై కూడా ముఖ్యమంత్రి విజయ్ సంతకం చేశారు. మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిపారు.
వివరాలు
విజయ్ చేసిన మరో కీలక ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత
ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ చేసిన మరో కీలక ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2021 నుంచి 2026 వరకు తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని తన తొలి ప్రసంగంలో ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. అనంతరం కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.