Chandrababu: గోదావరి-కావేరి అనుసంధానానికి పెద్దన్న పాత్ర పోషించండి: చంద్రబాబుకు విజయ్ విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేసేందుకు దేశంలో పెద్ద నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందడుగు వేయాలని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కోరారు. ఈ ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చేలా పెద్దన్న పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు, విజయ్ సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న విజయ్‌కు చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. తొలుత ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంతంగా కొద్దిసేపు చర్చించుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.
వివరాలు
నదులను అనుసంధానం.. దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరం
ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ తమ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను ప్రస్తావించారు.
వాటిపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తాజా పరిస్థితులను వివరిస్తూ సంక్షిప్త ప్రజంటేషన్ ఇచ్చారు.
మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని చంద్రబాబు పేర్కొన్నారు.
నదులను అనుసంధానం చేయడం దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని చెప్పారు.
పోలవరం-బనకచర్ల అంతర్గత నదుల అనుసంధానాన్ని గోదావరి-కావేరి ప్రాజెక్టులో భాగంగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని విజయ్‌కు వివరించారు.
వివరాలు
వాటి నుంచే చెన్నైకి నీటి సరఫరా
చెన్నై తాగునీటి అవసరాలపై చర్చ సందర్భంగా చంద్రబాబు కీలక వివరాలు వెల్లడించారు.
తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత జల సంవత్సరంలో ఇప్పటికే 4.08 టీఎంసీల నీటిని చెన్నైకి సరఫరా చేసినట్లు తెలిపారు.
ఎల్‌నినో పరిస్థితులు నెలకొనడంతోపాటు శ్రీశైలం నుంచి కండలేరుకు నీరు చేరకపోయినా, తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూ చెన్నై అవసరాలకు నీటిని అందించినట్లు వివరించారు.
గత ఏడాది కండలేరుకు చేరిన నీటిలో మిగిలిన క్యారీ ఓవర్ జలాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.
వాటి నుంచే చెన్నైకి నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పరిస్థితులు అనుకూలిస్తే మరో రెండు లేదా మూడు టీఎంసీల నీటిని చెన్నైకి అందించేందుకు అంగీకరించారు.
వివరాలు
చంద్రబాబుకు తమిళనాడు సీఎం లేఖ
సమావేశం ముగిసే సమయంలో తమిళనాడు సీఎం విజయ్ చంద్రబాబుకు ఒక లేఖను అందజేశారు.
ఈ భేటీలో ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ, నారా లోకేశ్ పాల్గొన్నారు.
తమిళనాడు తరఫున గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రి ఆనంద్, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఆదవ్ అర్జునతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
వివరాలు
నీరు పరస్పర సహకారానికి సాధనం కావాలి
నీరు రాష్ట్రాల మధ్య ఘర్షణలకు కారణం కాకుండా,పరస్పర సహకారాన్ని పెంపొందించే సాధనంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్రాల మధ్య సమన్వయంతో గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టు పూర్తయితే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతోపాటు దక్షిణ భారతదేశంలోని లక్షలాది మంది రైతుల జీవితాల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపినట్లు చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
నదుల అనుసంధానం ద్వారా నీటి లభ్యతను మెరుగుపరచడంతోపాటు రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.