
APSSC : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం.. ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కుంభకోణం కేసులో అరెస్టయిన పమిడికాల్వ మధుసూదన్ అలియాస్ ధాత్రి మధును పోలీసులు విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
న్యాయస్థానం అతడిని ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్‌కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పోలీసులు మధుసూదన్‌ను జైలుకు తరలించారు.
గ్రూప్-1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాల కేసులో మధుసూదన్‌ను మంగళవారం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఆయన రెండవ నిందితుడిగా (ఏ2) ఉన్నారు.
మధుసూదన్ క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
వివరాలు
నాటకంగా మూల్యాంకనం
అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాలతోనే ఈ మూల్యాంకన ప్రక్రియలో విస్తృత స్థాయిలో అక్రమాలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
హాయ్‌ల్యాండ్ ప్రాంతంలో మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించలేదని, అయినా అది జరిగిందని నమ్మించేందుకు అర్హత లేని వ్యక్తులను, అనామకులను, గృహిణులను తాత్కాలికంగా నియమించి నాటకంగా మూల్యాంకనం చేసినట్లు విచారణలో తేలింది.
అసలు జవాబు పత్రాలను వారు కనీసం తెరిచి కూడా చూడలేదని, క్యామ్‌సైన్ యాజమాన్యం పేర్కొన్న మార్కులనే పత్రాలపై నమోదు చేశామని వారు పోలీసుల విచారణలో పేర్కొన్నారు.
వివరాలు
విచారణలో మధుసూదన్ పాత్రపై కీలక సమాచారం
ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని పంచవటి కాలనీలో ఉన్న క్యామ్‌సైన్ మీడియా కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
దర్యాప్తు అధికారులు మధుసూదన్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు.
విచారణలో ఆయన పాత్రపై కీలక సమాచారం కూడా వెలుగు చూసింది.
విచారణ అనంతరం మంగళవారం రాత్రి మధుసూదన్‌ను అధికారికంగా అరెస్టు చేశారు.