Loading...
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ శస్త్రచికిత్సలు.. విజయవాడలో తొలి కేంద్రం
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ శస్త్రచికిత్సలు.. విజయవాడలో తొలి కేంద్రం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ శస్త్రచికిత్సలు.. విజయవాడలో తొలి కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రోబోటిక్‌ శస్త్రచికిత్సలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. తొలుత విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో రూ.45 కోట్ల వ్యయంతో రోబోటిక్‌ శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం విశాఖపట్నంలోని కేజీహెచ్‌, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లోనూ ఈ సదుపాయాన్ని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం బోధనాసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పన, వివిధ నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

వివరాలు 

రూ.1,011 కోట్లతో ఆధునిక వైద్య సదుపాయాలు

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను విస్తరించేందుకు మొత్తం రూ.1,011 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ విష్ణువర్ధన్‌ మంత్రికి వివరించారు.

ఐవీఎఫ్‌ (సంతాన సాఫల్య చికిత్స), బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (బీఎంటీ), అవయవ మార్పిడి సహా పలు ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిధులను వినియోగించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా రూ.17.50 కోట్లతో గుంటూరు, అనంతపురం, విజయనగరం, కాకినాడ, తిరుపతి ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడలో రూ.17 కోట్లతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు 

రూ.1,011 కోట్లతో ఆధునిక వైద్య సదుపాయాలు

అలాగే రూ.163.52 కోట్లతో పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రంతోపాటు మరో 11 పాత ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అవయవ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ.48 కోట్లతో బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (బీఎంటీ) కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు.

వైద్య విద్య, ప్రజారోగ్య రంగాల అభివృద్ధి కోసం రూ.180 కోట్లతో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు రూ.65 కోట్లతో ఐసీయూలను అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఐదు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలు

రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో సమగ్ర క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అనంతపురం, మచిలీపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, ఒంగోలులో ఈ కేంద్రాలను నెలకొల్పేందుకు సుమారు రూ.500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేంద్ర అణుశక్తి శాఖ నుంచి పొందేందుకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు సిద్ధం చేయాలి

ఆసుపత్రులకు వచ్చే రోగుల అవసరాలకు అనుగుణంగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.

వైద్య విద్యకు సంబంధించిన కోర్సులను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన భవనాలు, వైద్య పరికరాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ పనుల కోసం ఎస్‌ఏఎస్‌కేఐ (SASCI) కింద రూ.7,369 కోట్ల ఆర్థిక సహాయం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో డీపీహెచ్‌ వెంకటరమణ, ఏపీఎంఎస్‌ఐడీసీ చీఫ్‌ ఇంజినీర్‌ బలరామిరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

ADVERTISEMENT