తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు
తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టేసింది. రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విచారణ చేయలేదని విజయవాడ రైల్వే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా సున్నితమైన అంశాన్ని విచారించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని కోర్టు ప్రశ్నించింది. విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. రైలును తగలబెట్టిన కేసులో కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఇందులో ఏ1గా ముద్రగడ పద్మనాభం, ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా దాడిశెట్టి రాజా ఉన్నారు.
2016 జనవరి 31న ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన ఆందోళనకారులు
కాపు రిజర్వేషన్ల ఆందోళనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టారు. ఈ కేసు అప్పట్లో సంచలనం రేపింది. మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ కేసులో ఏ1గా ఉన్నారు. ఆందోళనకారులపై స్థానిక పోలీసులు పెట్టిన కేసులను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ రైల్వే పోలీసులు మాత్రం వదిలిపెట్టలేదు. ఓబీసీ కోటా కింద కాపులకు రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న సమయంలో 2016 జనవరి 31న ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టినందుకు గాను ముద్రగడతో పాటు మరికొందరిపై భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 146, 147, 153, 174 కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.