Vijayawada-Singapore: విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా ఇండిగో విమాన సర్వీసులు.. నవంబర్ 15 నుంచి ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో సంస్థ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులను నవంబర్ 15 నుంచి ప్రారంభిస్తోంది. ఈ సర్వీసుకు టికెట్ ధరను రూ.8,000గా నిర్ణయించారు. సింగపూర్ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 7.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అనంతరం విజయవాడ నుంచి ఉదయం 10.05 గంటలకు తిరిగి బయలుదేరి సింగపూర్‌కు వెళుతుంది. విజయవాడ నుంచి సింగపూర్ చేరుకునే ప్రయాణ సమయం సుమారు నాలుగు గంటలు ఉంటుంది. భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.05కు సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి ఈ విమానం చేరుకోనుంది.
వివరాలు
వారంలో మూడురోజులు నడిపి.. రద్దీని బట్టి..
ఇప్పటికే ఈ సర్వీసుకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రతి మంగళవారం,గురువారం,శనివారం రోజుల్లో నడుస్తాయి. 180 నుండి 230 సీట్ల సామర్థ్యం గల బోయింగ్ విమానాలను ఇండిగో సంస్థ ఈ మార్గంలో వినియోగించనుంది. ప్రారంభ దశలో వారానికి మూడు రోజుల పాటు మాత్రమే సర్వీసులు నడపాలని నిర్ణయించగా, ప్రయాణికుల డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీసులుగా విస్తరించే ఆలోచనలో సంస్థ ఉంది. గతంలో 2018 డిసెంబరు నుండి 2019 జూన్ వరకు విజయవాడ-సింగపూర్ రూట్‌పై ఇండిగో నడిపిన విమానాలకు విశేష స్పందన లభించింది. ఆ కాలంలో విజయవాడ నుంచి బయలుదేరిన విమానాలు సగటున 80 శాతం,సింగపూర్ నుంచి వచ్చిన సర్వీసులు 90 శాతం ఆక్యుపెన్సీతో నడిచినట్లు రికార్డులు చెబుతున్నాయి.