Visakha Double-Decker Metro: విశాఖ డబుల్ డెక్కర్ మెట్రో మార్గం 13 కిలోమీటర్లకే పరిమితం
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ మెట్రో మార్గం పొడవును తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మెట్రో రైలు సంస్థ 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించగా, దీనిపై అధ్యయనం నిర్వహించిన రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ మాత్రం గాజువాక నుంచి హనుమంతువాక వరకు 13 కిలోమీటర్ల మేర నిర్మిస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. విశాఖలో మొత్తం 140.13 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్న ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో తొలి దశలో రూ.11,498 కోట్ల వ్యయంతో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
వివరాలు
స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మెట్రో మార్గం
ఇదే సమయంలో నగరంలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు జాతీయ రహదారి వెంట లంకెలపాలెం నుంచి మధురవాడ సమీపంలోని కారు నిల్వ కేంద్రం వరకు పైవంతెన నిర్మించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిపాదన తరువాతే డబుల్ డెక్కర్ మెట్రో మార్గం ఆలోచన ముందుకు వచ్చింది. ప్రతిపాదన ప్రకారం స్టీల్‌ప్లాంట్ నుంచి గాజువాక వరకు 5 కిలోమీటర్లు,తాటిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు 15 కిలోమీటర్లు కలిపి మొత్తం 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మార్గాన్ని నిర్మించాలని భావించారు. జాతీయ రహదారి మధ్యభాగంలో స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మెట్రో మార్గం నిర్మించాలన్నది ప్రణాళికగా రూపొందించారు.
వివరాలు
డబుల్ డెక్కర్ మార్గాన్ని తగ్గించాలన్న రైట్స్ సంస్థ
ఈ విధానం అమలైతే భూసేకరణ అవసరం తగ్గడంతో పాటు ప్రాజెక్టు వ్యయం కూడా నియంత్రణలో ఉంటుందని అధికారులు భావించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించనున్న పైవంతెనపై భాగంలోనే మెట్రో మార్గం వెళ్లేలా రూపకల్పన చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర మెట్రో రైలు సంస్థ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే నగరంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యల కారణంగా మెట్రో కోసం ప్రజలు ఎదురుచూస్తున్న వేళ, డబుల్ డెక్కర్ మార్గాన్ని 20 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్లకు తగ్గించాలని రైట్స్ సంస్థ సూచించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.