LOADING...
Vishakapatnam: విద్యార్థుల ఒత్తిడి తగ్గించే యాప్'తో అంతర్జాతీయ గుర్తింపు.. 'స్విఫ్ట్‌ స్టూడెంట్ ఛాలెంజ్‌-2026'లో సత్తా చాటిన విశాఖ కుర్రాడు
'స్విఫ్ట్‌ స్టూడెంట్ ఛాలెంజ్‌-2026'లో సత్తా చాటిన విశాఖ కుర్రాడు

Vishakapatnam: విద్యార్థుల ఒత్తిడి తగ్గించే యాప్'తో అంతర్జాతీయ గుర్తింపు.. 'స్విఫ్ట్‌ స్టూడెంట్ ఛాలెంజ్‌-2026'లో సత్తా చాటిన విశాఖ కుర్రాడు

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ సంస్థ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'స్విఫ్ట్‌ స్టూడెంట్‌ ఛాలెంజ్‌-2026'లో విశాఖకు చెందిన గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి మానస్‌ మల్ల విశేష ప్రతిభ కనబరిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అత్యుత్తమ 15 మంది జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయుడిగా నిలిచి అరుదైన ఘనత సాధించాడు. ఈ విజయంతో జూన్‌ 9న అమెరికాలో నిర్వహించనున్న ఆపిల్‌ ప్రపంచ స్థాయి డెవలపర్స్‌ సదస్సుకు ఎంపికయ్యాడు. ఆ కార్యక్రమంలో ఆపిల్‌ సంస్థ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి టిమ్‌ కుక్‌తో మానస్‌ నేరుగా సమావేశం కానున్నాడు.

వివరాలు 

వినికిడి, చూపు సమస్యలు ఉన్న విద్యార్థులకు కూడా ఉపయోగం 

విద్యార్థుల్లో బట్టీ పద్ధతి చదువుల వల్ల పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో మానస్‌ 'స్టెమ్‌క్వెస్ట్‌' పేరుతో ప్రత్యేక అభ్యాస యాప్‌ రూపొందించాడు. కృత్రిమ మేధ, విస్తృత వాస్తవికత సాంకేతికాలను ఉపయోగించి తయారు చేసిన ఈ యాప్‌ పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా ఇది సమర్థంగా పనిచేయడం దీని ప్రత్యేకతగా నిలిచింది. ముఖ కవళికలను గుర్తించే సాంకేతికంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారా, ఆసక్తి కోల్పోయారా అన్న విషయాన్ని ఈ యాప్‌ వెంటనే గుర్తిస్తుంది. అనంతరం వారి అభిరుచులు, నేర్చుకునే విధానానికి అనుగుణంగా స్థానిక భాషల్లో స్నేహపూర్వకంగా పాఠాలను బోధిస్తుంది. వినికిడి, చూపు సమస్యలు ఉన్న విద్యార్థులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వివరాలు 

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా యాప్

పోటీ పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక తన స్నేహితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మానస్‌ను తీవ్రంగా కలిచివేసింది. అదే సమయంలో చిన్నతనంలో అమెరికాలో తాను అభ్యసించిన విధానాన్ని గుర్తు చేసుకుని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ఈ యాప్‌ ని రూపొందించినట్లు తెలిపాడు.

Advertisement