LOADING...
Vishakapatnam: విశాఖలో నేడు తొమ్మిది కంపెనీలకు భూమి పూజ
విశాఖలో నేడు తొమ్మిది కంపెనీలకు భూమి పూజ

Vishakapatnam: విశాఖలో నేడు తొమ్మిది కంపెనీలకు భూమి పూజ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో ఐటీ రంగం కొత్త వెలుగులతో మెరవడానికి రంగం సిద్ధమైంది. తాజా పెట్టుబడుల ప్రవాహంతో నగరం మరింత ఆధునిక రూపం దాల్చబోతోంది. కాగ్నిజెంట్‌తో పాటు మరో ఎనిమిది ప్రముఖ సంస్థల శంకుస్థాపన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ శంకుస్థాపనలు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతులమీదుగా జరగనున్నాయి. వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నట్లు అంచనా.

వివరాలు 

మౌలిక సదుపాయాలే కీలకం 

విశాఖలో పెట్టుబడులు పెరుగుతున్న ఈ సమయంలో, కూటమి ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పార్కింగ్ సౌకర్యాలు, బస్ స్టాప్‌లు, విస్తరించిన రహదారులు, పైవంతెనలు—ఇవి అన్నీ నగరానికి శక్తివంతమైన ఆధారం కావాలి. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను పెంచుతూ కనెక్టివిటీని బలోపేతం చేయాలి. దువ్వాడ, గోపాలపట్నం రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని కూడా విస్తరించటం అత్యవసరం. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న కొత్త విమానాశ్రయంతో పాటు విశాఖపట్నం ప్రస్తుత విమానాశ్రయాన్ని కూడా వినియోగంలో కొనసాగించాలి.

వివరాలు 

అందివచ్చే అవకాశాలుఎన్నో.. 

గూగుల్, మెటా, రిలయన్స్ వంటి ప్రపంచ దిగ్గజాల డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఏఐ ఆధారిత స్టార్టప్‌ల పెరుగుదలకు మార్గం సుగమం కానుంది. రెండు ప్రధాన సముద్రపు భూగర్భ కేబుల్స్, ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటు వల్ల హై స్పీడ్ ఇంటర్నెట్, అధిక వేగం గల కంప్యూటింగ్ లభ్యం కావడంతో హైటెక్ పరిశ్రమలకు విశాఖ ఆదర్శ గమ్యస్థానంగా అవుతుంది. స్థానిక యువత ఈ పెరుగుతున్న ఐటీ సంస్థల అవసరాలకు తగ్గ నైపుణ్యాలను సులభంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్, బీమా రంగాల్లో పెట్టుబడులు సహజంగానే పెరుగుతాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా వేగంగా విస్తరిస్తూ మరింత చైతన్యం సంతరించుకుంటుంది.

Advertisement

వివరాలు 

వేగంగా అమలు కావాలి 

ఈ మార్పులు మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా దోహదం చేస్తాయి. ఇక టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు తమ క్యాంపస్‌లను విశాఖలో స్థాపిస్తుండటంతో, అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ తో పాటు ఇతర పెద్ద సంస్థల దృష్టి కూడా స్పష్టంగా విశాఖపట్టణంపైనే కేంద్రీకృతమవుతోంది. మౌలిక సదుపాయాల ప్రణాళికలను త్వరితగతిన అమలు చేస్తే పెట్టుబడుల ప్రవాహం ఇంకా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్ విజన్‌తో ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ వైపు వస్తున్నాయనీ, కేంద్ర సహాయంతో అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఉందని రుషికొండ ఐటీ హిల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, విశాఖ డెవలెప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షులు ఒ. నరేష్‌కుమార్ తెలిపారు.

Advertisement