Visakhapatnam Beach Development: సరికొత్తగా.. విశాఖ తీరం రూపు.. CRZ కేటగిరీ మార్పుపై కీలక కసరత్తు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖ తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే తీర నియంత్రణ ప్రాంతం (CRZ) నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏ నిర్మాణం చేపట్టినా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లవుతోంది. దీంతో న్యాయస్థానాల్లో కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బేసిటీ, విశాఖ ఎకనమిక్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VER) పరిధిలోని ప్రాజెక్టులకూ ఆటంకాలు తప్పడం లేదు. ప్రతిపాదిత ప్రాజెక్టులు పట్టాలెక్కాలంటే జిల్లాలోని తీర ప్రాంతాల CRZ కేటగిరీలను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు దీనిపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.
వివరాలు
విశాఖకూ అదే ముప్పు తప్పదా?
వాస్తవానికి విశాఖలో 2019 CRZ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం 2011 CRZ నిబంధనలే అమల్లో ఉన్నాయి.
విశాఖ జిల్లాలో CRZ పరిధిలోకి వచ్చే తీర ప్రాంతం 46.99 చదరపు కిలోమీటర్లుగా ఉంది.
తీరం నుంచి 50 మీటర్ల వరకు నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధనకు ఇచ్చిన సడలింపు దేశవ్యాప్తంగా అనేక తీర నగరాలను పెను ప్రమాదంలోకి నెట్టిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖలోని కొన్ని తీర ప్రాంతాలను CRZ-2 కేటగిరీలోకి మార్చితే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో CRZ మ్యాపులను సిద్ధం చేసినప్పటికీ.. విశాఖ జిల్లా విషయంలో మాత్రం వివిధ కారణాలతో జాప్యం జరిగింది.
వివరాలు
నిబంధనలు పట్టించుకోకుండా నిర్మాణాలు
నగర పరిధిలోని ఆర్‌కే బీచ్ నుంచి భీమిలి వరకు కొన్నేళ్లుగా అనేక CRZ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి.
నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని, వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అవి ఆగలేదని పేర్కొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా CRZ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 54 కేసులు ఉండగా.. ఒక్క విశాఖలోనే 24 కేసులు ఉన్నాయి.
'నో డెవలప్‌మెంట్ జోన్'లో హోటళ్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. సహజసిద్ధమైన ఇసుక తిన్నెలను సైతం తవ్వేసి నిర్మాణాలు చేపట్టారు.
వివరాలు
ప్రస్తుతం CRZ-3 పరిధిలో..
తీర ప్రాంతాల CRZ కేటగిరీని మార్చడం వల్ల గతంలో జరిగిన ఉల్లంఘనలన్నింటికీ చట్టబద్ధత కల్పించినట్లవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ అభివృద్ధికి పర్యాటకం, రియల్ ఎస్టేట్, మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. తీర ప్రాంత కోత, తుపాన్ల తాకిడి, అలల విధ్వంసం వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
ఉన్నవి: విశాఖ గ్రామీణం, భీమిలి, పెదగంట్యాడ, పరవాడ మండలాల్లోని తీర ప్రాంతాలు ప్రస్తుతం CRZ-3 పరిధిలో ఉన్నాయి.
నిబంధన: గ్రామీణ ప్రాంతాల్లో తీరం నుంచి 500 మీటర్ల వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకూడదు.
ఫలితం: ఈ నిబంధనల కారణంగా ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు.
ఆలోచన: ఈ ప్రాంతాలను CRZ-2 పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు.
వివరాలు
అమలైతే..
కార్పొరేషన్ పరిధిలో తీరం నుంచి 50 మీటర్ల వరకు మాత్రమే 'నో డెవలప్‌మెంట్ జోన్' అమల్లో ఉంటుంది.
పైన పేర్కొన్న విశాఖ గ్రామీణం, భీమిలి, పెదగంట్యాడ, పరవాడ మండలాలు గతంలోనే జీవీఎంసీ పరిధిలోకి వచ్చినప్పటికీ.. వాటి CRZ కేటగిరీలో మాత్రం మార్పు జరగలేదు.
కేటగిరీని మార్చేందుకు ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా.. కొందరు దీనిని వ్యతిరేకించారు.