Loading...
Visakhapatnam : విశాఖ డేటా సెంటర్లపై అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: లోకేశ్
విశాఖ డేటా సెంటర్లపై అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: లోకేశ్

Visakhapatnam : విశాఖ డేటా సెంటర్లపై అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: లోకేశ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల విషయంలో నీటి వినియోగం,పర్యావరణ ప్రభావంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. డేటా సెంటర్ల కారణంగా నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తదని హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటును ప్రభుత్వం తరఫున సమర్థించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, దేశ డేటా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి డేటా సెంటర్లు కీలకమైనవని లోకేశ్‌ పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్‌ ముందుకు రావడంతో ఇతర ఐటీ సంస్థల్లోనూ నగరంపై ఆసక్తి పెరిగిందని తెలిపారు.

వివరాలు 

డేటా సెంటర్లకు పోలవరం పారిశ్రామిక వాటా నుంచి నీటిని కేటాయిస్తామని స్పష్టత

ప్రతిపాదిత డేటా సెంటర్లన్నీ పూర్తి స్థాయిలో పనిచేసి 6.5గిగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నా.. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఏడాదికి సుమారు 3టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని అంచనా వేసినట్లు మంత్రి వివరించారు.

భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అధునాతన కూలింగ్‌ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.

డేటా సెంటర్ల అవసరాలకు ఉపయోగించే నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన వాటా నుంచే తీసుకుంటామని లోకేశ్‌ తెలిపారు.

దీనివల్ల విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

డేటా సెంటర్లకు నీటి సరఫరా కోసం ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

వివరాలు 

థర్మల్ పవర్ ప్లాంట్‌తో పోలిస్తే డేటా సెంటర్ల నీటి వినియోగం చాలా తక్కువని వివరణ

మరో 18 నెలల్లో గ్రావిటీ ఆధారంగా పోలవరం నీటిని విశాఖ నగరానికి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

నీటి వినియోగంపై వివరిస్తూ.. ఒక గిగావాట్‌ సామర్థ్యం ఉన్న థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఒక డేటా సెంటర్‌తో పోలిస్తే దాదాపు పది రెట్లు అధికంగా నీటిని వినియోగిస్తుందని లోకేశ్‌ చెప్పారు.

అలాంటప్పుడు డేటా సెంటర్ల నీటి వినియోగంపైనే ఎందుకు నిరసనలు వ్యక్తమవుతున్నాయని ప్రశ్నించారు.

డేటా సెంటర్ల ఏర్పాటుకు 6.5 గిగావాట్ల పరిమితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టంగా నిర్దేశించారని, ఆ లక్ష్యం కూడా పూర్తయిందని మంత్రి తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చే సంస్థలకే ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

నీటి వనరులపై ప్రభావం చూపుతాయని పౌర సంఘాలు, విపక్షాల ఆందోళన

విశాఖ జిల్లాలోని అడవివరం-ముదసర్లోవ, తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో ప్రతిపాదిత డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.

అయితే ఈ ప్రాజెక్టుల వల్ల నీరు, విద్యుత్‌ వంటి వనరులపై ఒత్తిడి పెరుగుతుందని, పర్యావరణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశాఖకు చెందిన పౌర సంఘాలు, సీపీఐ, సీపీఎం తదితర వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ADVERTISEMENT