Visakhapatnam: కేంద్రం సీఈఆర్ పథకానికి విశాఖ ఎంపిక.. రూ.5 వేల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి,ఫైనాన్సింగ్ ఇనీషియేటివ్‌లో భాగంగా ప్రకటించిన సిటీ ఎకనమిక్ రీజియన్ (సీఈఆర్)పథకానికి విశాఖపట్టణం ఎంపికైంది. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక పథకంలో అవకాశం పొందిన ఏకైక నగరంగా విశాఖ నిలిచింది. ఈ పథకం ద్వారా నగరంలో సుమారు రూ.5వేల కోట్ల వ్యయంతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో ఇప్పటికే 49అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఈఆర్ కింద ప్రాధాన్యంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల ఎంపికపై అధికారులు ఒకటి,రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు తుది ప్రతిపాదనలను ఖరారు చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు.
వివరాలు
మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ప్రణాళిక
సిటీ ఎకనమిక్ రీజియన్ పథకం కోసం దేశవ్యాప్తంగా ఐదు నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. విశాఖపట్నంతో పాటు ముంబయి, సూరత్, భువనేశ్వర్, వారణాసి ఈ జాబితాలో ఉన్నాయి. ఎంపికైన ప్రతి నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్ల చొప్పున నిధులు కేటాయించనున్నారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.1,500 కోట్లను రుణ రూపంలో కేంద్రం అందించనుండగా, మిగిలిన రూ.3,500 కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ నిధులతో రవాణా, పారిశ్రామిక, పట్టణ మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.