LOADING...
Andhrapradesh: ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం.. ఈ ప్రాజెక్టుకు రూ.960 కోట్లు మంజూరు
ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం.. ఈ ప్రాజెక్టుకు రూ.960 కోట్లు మంజూరు

Andhrapradesh: ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం.. ఈ ప్రాజెక్టుకు రూ.960 కోట్లు మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మరో ముఖ్యమైన నేషనల్ హైవే ప్రాజెక్ట్ వేగం అందుకుంది. విశాఖపట్టణం నగర పరిధిలోని షీలానగర్‌ నుంచి అనకాపల్లి జిల్లా సబ్బవరం వరకు ఆరు వరుసల జాతీయ రహదారి (516C) నిర్మాణం జోరుగా కొనసాగుతోంది. ఈ రహదారి సిద్ధమైతే, విశాఖపట్నం పోర్టుకు వెళ్లే వాహనాల రద్దీ తగ్గి, ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. సరకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ₹960కోట్ల నిధులు మంజూరయ్యాయి. షీలానగర్‌ నుంచి సబ్బవరం వరకు నిర్మించే ఈ కొత్త రహదారిని ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విశాఖ పోర్టుకు మంచి కనెక్టివిటీ కల్పించేందుకు నేషనల్ హైవే అథారిటీ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది.

వివరాలు 

నగరంలోని ప్రధాన రహదారులపై వాహన రద్దీ తగ్గి,ప్రయాణికులకు సౌకర్యం

అంతేకాదు, కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి ఆరు లైన్ల రోడ్డును ₹679 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. కొత్త మార్గం పూర్తయ్యాక, సరకు రవాణా లారీలు ఇకపై గాజువాక హైవేపైగా నగరంలోకి ప్రవేశించవు. బదులుగా,సబ్బవరం వద్ద ప్రారంభమయ్యే ఆరు వరుసల రహదారిలో షీలానగర్‌ వరకు వచ్చి,అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌ పక్కగా కాన్వెంట్‌ జంక్షన్‌ మీదుగా నేరుగా పోర్టు చేరుకుంటాయి. ఈ మార్పుతో నగర ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సరకు వాహనాలపై ఉండే ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా తొలగిపోతాయి. ఈ కొత్త మార్గం వలన ట్రక్‌లు 24గంటలూ నిరాటంకంగా నడవగలవు.దీని ఫలితంగా,నగరంలోని ప్రధాన రహదారులపై వాహన రద్దీ తగ్గి,ప్రయాణికులకు సౌకర్యం పెరుగుతుంది.

వివరాలు 

'ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌' ఏర్పాటు

ముఖ్యంగా గాజువాక హైవేపై ట్రాఫిక్‌ భారం తగ్గి,రవాణా వ్యవస్థ సులభతరం అవుతుంది.వ్యాపారాలు, పరిశ్రమలకు కూడా దీని ద్వారా ఎంతో మేలు చేకూరనుంది. కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి సబ్బవరం బైపాస్‌ వరకు 13కిలోమీటర్ల రహదారిని ఆరువరుసలుగా విస్తరించే పనులు ప్రణాళికలో ఉన్నాయి. ఇప్పటికే జరుగుతున్న కాన్వెంట్‌ జంక్షన్‌-షీలానగర్‌ రహదారి విస్తరణకు ఇది కొనసాగింపుగా ఉంటుంది. సబ్బవరం వద్ద ఈరహదారిని జాతీయ హైవేతో కలిపేలా 'ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌' ఏర్పాటు చేయనున్నారు. దీంతో విశాఖపోర్టు నుంచి కార్గో రవాణా మరింత సులభతరం అవుతుంది.నగర ట్రాఫిక్‌ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే విశాఖపోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం బలోపేతం కానుంది. ఈఏడాది జనవరిలోనే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించినట్టు కేంద్ర రహదారులు,రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.