Page Loader
వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత
వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత

వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత

వ్రాసిన వారు Stalin
Apr 20, 2023
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్‌ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలను విచారిస్తూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అవినాష్ రెడ్డి తాను అరెస్ట్ కాకుండా ఉండేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్‌ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించిన హైకోర్టు.. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు రేపు దీనిపై విచారణ చేపట్టనుంది.

సీబీఐ

ముగ్గురిని వేర్వేరుగా విచారిస్తున్న సీబీఐ

సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గురువారం విచారణకు హాజరయ్యారు. అలాగే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలు నుంచి వారిని కోఠీలోని సీబీఐ ఆఫీస్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. అయితే ఈ ముగ్గురిని సీబీఐ అధికారులు వేర్వేరుగా విచారిస్తున్నారు. సాయంత్రం 5గంటలకు వరకు వీరిని విచారించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, సీబీఐ అధికారులు బుధవారం నుంచి అవినాశ్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీబీఐ అధికారులు బుధవారం అడిగిన ప్రశ్నలకు కొనసాగింపుగా గురువారం అడుగుతున్నట్లు తెలుస్తోంది.