Vizag: విశాఖకు మెగా మేకోవర్.. బే సిటీ తర్వాత ఇంటిగ్రేటెడ్ సిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం,పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భోగాపురంలో ఏరో సిటీ, విశాఖలో బే సిటీ ప్రాజెక్టులతో పాటు మరో ప్రతిష్ఠాత్మకమైన ఇంటిగ్రేటెడ్ సిటీని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. విశాఖను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం ముసాయిదా ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మిశ్రమ వినియోగ స్థలాలను గుర్తించి వివిధ రకాల హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. బీచ్ ప్రాంతాలు, ప్రధాన పర్యాటక కేంద్రాలను ఈ అభివృద్ధి ప్రణాళికతో అనుసంధానం చేస్తారు.
వివరాలు
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP)విధానంలో అభివృద్ధి
ముందుగా అందుబాటులో ఉన్న భూములతో పాటు ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని సమీకరిస్తారు. అనంతరం వాటిని వీఎంఆర్‌డీఏకు బదలాయించి కొన్ని ప్రాజెక్టులను నేరుగా, మరికొన్నింటిని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP)విధానంలో అభివృద్ధి చేయనున్నారు. మల్టీపర్పస్ సర్వీస్ పార్కులు, ఆధునిక నివాస ప్రాంతాలు,రిటైల్,కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లను సమగ్రంగా అభివృద్ధి చేసి విశాఖను ఇంటిగ్రేటెడ్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖ పోర్టు నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు అభివృద్ధి చేసే విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ప్రాజెక్టులో ఈ అంశాలు కీలకంగా ఉండనున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖలో అధికారులతో సమావేశమై ఈ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ముందుగా బే సిటీ ప్రాజెక్టును పూర్తి చేసి, అనంతరం ఇంటిగ్రేటెడ్ సిటీ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
వివరాలు
7 వేల ఇళ్లు.. పర్యాటకానికి పెద్దపీట
బ్రౌన్ ఫీల్డ్ నగరాభివృద్ధిలో భాగంగా 10 నుంచి 15 శాతం వరకు భూములను సేకరించనున్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా 2,500 హోటల్ గదులు, 70కి పైగా రెస్టారెంట్లు, దాదాపు 100 బీచ్ హట్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే నివాస అవసరాల కోసం 5 వేల నుంచి 7 వేల వరకు విల్లాలు, అపార్టుమెంట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో బీచ్ కారిడార్ వెంబడి ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి.
వివరాలు
కైలాసగిరికి కొత్త హంగులు
కైలాసగిరి పరిసరాల్లోని 400 ఎకరాలను వెల్‌నెస్ అండ్ రిక్రియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రిసార్టులు, వాణిజ్య సముదాయాలు, యోగా కేంద్రాలు, ఆధునిక భోజనశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, అటవీ శాఖ, జీవీఎంసీ సంయుక్తంగా చేపట్టనున్నాయి. 680 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన కైలాసగిరిలో 220 హెక్టార్ల భూభాగాన్ని కొత్త పర్యాటక ప్రాజెక్టుల కోసం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జీవవైవిధ్య పరిరక్షణ కేంద్రంతో పాటు జల జీవరాశుల సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
అంతర్జాతీయ అడ్వెంచర్ థీమ్ పార్క్
విశాఖ నగరంలో 75 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అడ్వెంచర్ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందించేలా వివిధ రకాల వినోద, సాహస క్రీడా సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. కీలక ప్రాంతాలు: కోర్ సిటీ, మధురవాడ, ఆనందపురం, భోగాపురం పొడవు : 50 కిలోమీటర్లు ఇంటిగ్రేటెడ్ సిటీ విస్తీర్ణం : 210 చదరపు కిలోమీటర్లు