Vontimitta Priests : ఒంటిమిట్ట అర్చకులపై టీటీడీ ఆగ్రహం.. జగన్ నివాసంలో వేదాశీర్వచనం వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకుల వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆలయ నిబంధనలను పక్కనబెట్టి పులివెందులలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లి ఆయనకు వేదాశీర్వచనం చేయడాన్ని టీటీడీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో సంబంధిత అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, వారు ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఈ ముగ్గురు అర్చకులు, మరికొందరితో కలిసి జగన్ నివాసానికి వెళ్లి వేద ఆశీర్వచనం అందించారు.
వివరాలు
ఆలయ మర్యాదలకు విరుద్దమంటూ ఫైర్..
ఆలయానికి సంబంధించిన నియమాలను విస్మరించి, వ్యక్తిగతంగా రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్లడం తగదని ఆలయ యాజమాన్యం అభిప్రాయపడింది. ఈ చర్య ఆలయ మర్యాదలకు విరుద్ధమని పేర్కొంటూ వారిపై చర్యలు ప్రారంభించింది. జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రెండు రోజుల లోపు వివరణ ఇవ్వాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. అర్చకులు ఇచ్చే సమాధానం తగిన విధంగా లేకపోతే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరించింది. ఆలయ పవిత్రత, నియమాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. కాగా ఈ నోటీసులపై అర్చకుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన వెలువడలేదు.