Loading...
Voter Verification: ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం.. ఈ నెల 27 నుంచి విచారణ
ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం.. ఈ నెల 27 నుంచి విచారణ

Voter Verification: ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం.. ఈ నెల 27 నుంచి విచారణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్లకు ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 20 వరకు ఎన్నికల అధికారులు విచారణ నిర్వహించనున్నారు. నోటీసుల జనరేషన్, ప్రింటింగ్‌ ప్రక్రియను ఈ నెల 31లోగా పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. నోటీసుల షెడ్యూల్‌, ముద్రణ,పంపిణీ,ఓటర్ల విచారణకు సంబంధించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం తాజాగా పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో నోటీసులు అందుకునే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా అనవసరంగా తొలగిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వివరాలు 

ఓటర్లకు పూర్తి వివరాలు చెప్పాలి

జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్వోలు), ఏఈఆర్వోలు, బీఎల్‌వోలు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఓటర్ల విచారణ తేదీకి 48 గంటలలోపు సంబంధిత స్లిప్‌లను ముద్రించి బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు) ద్వారా పంపిణీ చేయాలి.

నోటీసులు అందించిన వెంటనే ఆ వివరాలను బీఎల్‌వోలు యాప్‌లో నమోదు చేయాలి.

నోటీసులు జారీ చేయడానికి కారణం ఏమిటి? విచారణకు ఎప్పుడు, ఎక్కడ హాజరు కావాలి? ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకురావాలి? అనే విషయాలను బీఎల్‌వోలు ఓటర్లకు స్పష్టంగా వివరించాలి.

వివరాలు 

మూడు మార్గాల్లో పత్రాలు సమర్పణ

ఓటర్లు తమకు సంబంధించిన ధ్రువపత్రాలను మూడు విధాలుగా సమర్పించవచ్చు.

ఓటరు పోర్టల్‌, బీఎల్‌వో యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయడంతో పాటు విచారణ సమయంలో నేరుగా హాజరై పత్రాలను అందజేసే అవకాశం ఉంది.

విచారణ జరిగే సమయంలో ఈఆర్వోల వద్ద బీఎల్‌వోలు కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.

ఓటరు హాజరుపై ధ్రువీకరణ

నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు నేరుగా హాజరయ్యారా? లేదా? అనే విషయాన్ని ఎన్నికల అధికారులు ధ్రువీకరించుకోవాలి.

తమ వివరణ ఇవ్వడానికి లేదా ధ్రువపత్రాలు సమర్పించడానికి అదనపు సమయం కావాలని ఓటర్లు కోరితే ఆ గడువు ఇవ్వాలని సూచించారు.

తుది ఓటర్ల జాబితా ప్రకటించే సమయానికి నోటీసులు అందుకున్న ప్రతి ఓటరుకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ఆదేశించారు.

ADVERTISEMENT

వివరాలు 

ధ్రువపత్రాల పరిశీలన కీలకం

ఓటర్లు సమర్పించిన ధ్రువపత్రాలను సంబంధిత శాఖకు డీఈవోలు పంపించి వాటి ప్రామాణికతను ధ్రువీకరించుకోవాలి.

అన్‌మ్యాపింగ్‌, అనామలీస్‌ కేటగిరీలకు చెందిన ఓటర్ల ధ్రువపత్రాలను, పేరు లేదా వయసులోని దోషాలను మినహాయించి, ఈఆర్వోలు డీఈవోలకు పంపించాలి. జిరాక్స్‌ కాపీలకు బదులుగా అసలు ధ్రువపత్రాలనే అప్‌లోడ్‌ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఓటరు సమర్పించిన పత్రాలతో ఈఆర్వో సంతృప్తి చెందకపోతే ఆ నిర్ణయాన్ని వెంటనే సంబంధిత ఓటరుకు తెలియజేయాలి.

అదే సమాచారాన్ని ఫారమ్‌-7 ద్వారా అప్‌లోడ్‌ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

గ్రామ, వార్డు కార్యాలయాల్లోనే విచారణ

ఓటర్ల విచారణను గ్రామ పంచాయతీ భవనాలు లేదా వార్డు కార్యాలయాల్లోనే నిర్వహించాలని సూచించారు.

విచారణ జరిగే ప్రదేశం, సమయం తదితర వివరాలను దండోరా లేదా టాం-టాం ద్వారా స్థానిక ఓటర్లకు తెలియజేయాలి.

అప్పీళ్ల కోసం ప్రత్యేక సెల్‌

ఓటర్లకు అప్పీల్‌ విచారణ నిర్వహించేందుకు డీఈవో కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఓటర్లు సమర్పించిన పత్రాలు, ఇచ్చిన సమాచారంపై ఈఆర్వోకు నమ్మకం కలగని సందర్భాల్లో మాత్రమే ఓటు తొలగింపునకు సంబంధించిన స్పీకింగ్‌ ఆర్డర్‌ జారీ చేయాలి.

అంటే ఓటు తొలగింపునకు గల కారణాలను స్పష్టంగా పేర్కొంటూ ఆ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.

వివరాలు 

27న గ్రామ, వార్డు సభలు

ఈ నెల 27న గ్రామ, వార్డు సభలను నిర్వహించి ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను చదివి వినిపించాలని అధికారులు నిర్ణయించారు.

ఏఎస్‌డీడీ కేటగిరీలో తొలగించిన ఓటర్ల వివరాలను కూడా ఈ సభల్లో ప్రకటించాలి. ఆచూకీ లభించని వారు, వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్‌ ఓటర్ల వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

సీఈవో వీడియో కాన్ఫరెన్స్‌

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం డీఈవోలు, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ, ధ్రువపత్రాల పరిశీలన, ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ADVERTISEMENT