Telangana: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై చాలా కాలంగా చర్చలు కొనసాగుతుండగా,రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో సంప్రదింపులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వేం నరేందర్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి మురళీధర్ మొహోల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
వివరాలు
రూ.496.86 కోట్లతో వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రూ.496.86 కోట్ల అంచనా వ్యయంతో సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడంతో పాటు అవసరమైన చట్టపరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలను వేగంగా కల్పిస్తే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
అన్ని ప్రక్రియలు పూర్తైన వెంటనే ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన నిర్వహించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్రం తెలిపింది.
వాటిని పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఎయిర్‌ఫీల్డ్‌ను పౌర, రక్షణ అవసరాలకు వినియోగించే అవకాశాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం నిర్వహిస్తోంది.
వివరాలు
ఎయిర్‌పోర్ట్ విస్తరణకు అవసరమైన అదనపు భూమి వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు స్పష్టం
అక్కడ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు అవసరమైన అదనపు భూమి వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు స్పష్టం చేసింది.
అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం,చెంచుపల్లి, సుజాత్‌నగర్ గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన స్థలంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సాధ్యపడదని కేంద్రం తేల్చిచెప్పింది.
ఆ ప్రాంతానికి సమీపంలో రైల్వే మార్గాలు, కొండలు ఉండటంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వివరించింది.
వివరాలు
కాకతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక శైలిలో రూపకల్పన
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిన వెంటనే వేగంగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం పేర్కొంది.
ఈ విమానాశ్రయాన్ని కాకతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక శైలిలో రూపకల్పన చేయనున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో 58 విమాన మార్గాలు అందుబాటులో ఉండగా, కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.