Hyderabad : హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. నల్లాకు మోటర్ పెడితే రూ.5,000 ఫైన్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లో వేసవి ప్రారంభమవడంతోనే కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ట్యాంకర్లకు భారీ డిమాండ్ నెలకొంది. మరోవైపు జలమండలి కూడా దూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి హైదరాబాద్ నగర ప్రజలకు సరఫరా చేస్తోంది. అయినప్పటికీ కొందరు వినియోగదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ నల్లాలకు అక్రమంగా మోటార్లు అమర్చుకుని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్&ఎస్‌బీ) కఠిన చర్యలకు దిగింది. కుళాయిలకు అక్రమంగా మోటార్లు అమర్చిన వారికి రూ.5,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తే పోలీసు చర్యలు కూడా తప్పవని హెచ్చరించింది.
వివరాలు
అయా ప్రాంతాల్లో తనిఖీలు
నీటి సరఫరాను పెంచుకోవడానికి కొందరు వినియోగదారులు కుళాయి కనెక్షన్లకు మోటార్లు అమర్చడం వల్ల ఇతర ప్రాంతాల్లో నీటి ఒత్తిడి (ప్రెషర్) తగ్గిపోతున్నట్లు జలమండలి గుర్తించింది. ఇప్పటికే కొన్ని కాలనీల నుంచి లో ప్రెషర్‌పై ఫిర్యాదులు అందగా, ప్రాథమిక విచారణలో అక్రమ మోటార్లే ప్రధాన కారణమని తేలింది. నీటి సరఫరా సమయంలో అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించి తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఆటోమేటిక్, హై-స్పీడ్ మోటార్ల వినియోగం పెరిగింది. దీని వల్ల సరఫరా లైన్ల చివరన ఉన్న కుటుంబాలకు తగినంత తాగునీరు అందడం లేదు. సైబరాబాద్, మల్కాజ్‌గిరితో పాటు హైదరాబాద్‌ను కవర్ చేసే కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వివరాలు
నల్లాలకు మోటార్లు అమర్చిన వారిపై చర్యలు
మెట్రో కస్టమర్ కేర్ నంబర్ 155313, అలాగే HMWSSB మొబైల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఇంటింటికీ తనిఖీలు నిర్వహించి, నల్లాలకు మోటార్లు అమర్చిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం సాధారణ మోటార్లతో పాటు మార్కెట్‌లోకి వచ్చిన ఆటోమేటిక్ హైస్పీడ్ మోటార్ల వినియోగం పెరగడం సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది. ఈ మోటార్లు నీటి ఒత్తిడిని అధికంగా లాగేయడంతో చివరి కనెక్షన్‌లకు సరఫరా దాదాపు నిలిచిపోతోంది. దీంతో మిగతా వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జలమండలి అధికారులు తెలిపారు.